సంగారెడ్డి టౌన్: పిల్లల సంరక్షణలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రూపొందించిన చైల్డ్ ఫ్రెండ్ లీగల్ సర్వీసెస్ టు చిల్డ్రన్ స్కీంపై శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి చిన్నారికి సురక్షితమైన, హింస రహితమైన విద్యా వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తూ వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను నిశితంగా గమనించాలని సూచించారు. బాలలపై జరిగే వేధింపులు, బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లాలోని 239 ప్రభుత్వ పాఠశాలలో 239 మంది ఉపాధ్యాయులను చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు మానసిక ఒత్తిడి ప్రవర్తన మార్పులను ప్రారంభ దశలోనే గుర్తించి తల్లిదండ్రులు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చైతన్య రెడ్డి, జడ్జిలు, జిల్లా సంబంధిత శాఖల అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర


