ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు చేపట్టిన ముందస్తు చర్యల్లో భాగంగా ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని కేవలం మిషన్‌భగీరథ తాగునీటి సరఫరాకే పరిమితం చేయాలని నిర్ణయించారు. ఇందులోభాగంగా పరిశ్రమలకు మిషన్‌భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న నీటిని నిలిపివేస్తామని ఆ శాఖ అధికారులు పరిశ్రమలకు నోటీసులు జారీ చేశారు. కానీ బీరు ఫ్యాక్టరీలకు మాత్రం ఈ నిలిపివేత నుంచి మినహాయింపునిచ్చారు. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి
ప్రాజెక్టుల్లో నీటిని తాగునీటికే పరిమితం చేయాలని నిర్ణయం
పరిశ్రమలకు సరఫరా నిలిపి వేస్తామన్న మిషన్ భగీరథ శాఖ
బ్రేవరీస్‌లకు మాత్రం మినహాయింపు..!
హైదరాబాద్ నగరానికి నీటిని సరఫరా చేసే సింగూరులో ప్రస్తుతం కేవలం 4.3 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ నీరు తాగునీటికి సరఫరా చేసినా ఈ ఏడాది నవంబర్ వరకే సరిపోతాయని మిషన్‌భగీరథ అధికారులు ప్రకటించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పరిశ్రమలకు నీటి సరఫరాను నిలిపివేస్తామని ముందస్తు నోటీసులు జారీ చేస్తామని మిషన్‌భగీరథ పర్యవేక్షక ఇంజనీర్ రఘువీర్ ఇటీవల జరిగిన సమీక్షలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో ఉన్న సుమారు 17 ఫ్యాక్టరీలకు నోటీసులు ఇస్తున్నట్లు సమావేశంలో పేర్కొన్నారు. ఇందులో ఫార్మా, పాలీప్లాస్ట్, ఆగ్రో, ఆటోమొబైల్, మాన్‌ఫ్యాక్చరింగ్ వంటి పరిశ్రమలున్నాయి. వీటికి నిత్యం మిషన్‌భగీరథ ద్వారా నీరు సరఫరా అవుతోంది.
బీరు ఫ్యాక్టరీలకు ఓకే
బీరు ఫ్యాక్టరీలకు మాత్రం నీటి నిలిపివేత నుంచి మినహాయింపునునిచ్చారు. సంగారెడ్డి జిల్లాలో బీరు తయారు చేసే ఫ్యాక్టరీలు ఆరు ఉన్నాయి. రాష్ట్రానికి సరిపడా బీరు ఇక్కడే ఉత్పత్తి అవుతోంది. వీటిలో కొన్ని రెండు ఫ్యాక్టరీలకు హెచ్‌ఎండబ్ల్యూఎస్ (హైదరాబాద్ మెట్రో వాటర్ వర్‌స్క్) నుంచి నీరు సరఫరా అవుతోంది. సింగూరు నుంచి హైదరాబాద్ నగరానికి సరఫరా అయ్యే పైప్‌లైన్ నుంచి ఈ బీరు ఫ్యాక్టరీలు పైప్‌లైన్లను అటాచ్ చేసుకుని నీటిని వినియోగించుకుంటున్నాయి. ఒక ఫ్యాక్టరీకి నెలకు తొమ్మిది వేల కేఎల్ (90 లక్షల లీటర్లు) నీటిని సరఫరా అవుతోంది. అయితే ఇతర పరిశ్రమలకు నీటి సరఫరా నిలిపివేయాలని మిషన్‌భగీరథ శాఖ గానీ, ఈ బీరు ఫ్యాక్టరీలకు మాత్రం నీటి సరఫరా నిలిపివేతపై హెచ్‌ఎండబ్ల్యూఎస్ గానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. పరిశ్రమలకు నీటి సరఫరా నిలిపివేస్తామని నోటీసులు ఇవ్వలేదని..రానున్న రోజుల్లో నీటి సరఫరా తగ్గే అవకాశాలుండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని మౌఖికంగా మాత్రమే చెప్పినట్లు హెచ్‌ఎండబ్ల్యూఎస్ అధికారి ఒకరు ‘సాక్షి’ప్రతినిధితో తెలిపారు.
మంజీరా డ్యాం వద్ద హెచ్‌ఎండబ్ల్యూఎస్ తాగునీటి సరఫరా ప్లాంటు
ఎల్‌నినోను ఎదుర్కొనే ముందస్తు చర్యల్లో భాగంగా..


