ఇక స్మార్ట్‌గా రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

ఇక స్మార్ట్‌గా రేషన్‌

Jul 26 2026 8:00 AM | Updated on Jul 26 2026 8:00 AM

2006లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉండగా కొత్త రేషన్‌ కార్డులను జారీ చేశారు. నాడు కుటుంబ సభ్యులు ఫొటోలు, పేర్లు, వయసు, ఇతర వివరాలతో కూడుకొని కార్డులను జారీ చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రేషన్‌ కార్డుల నవీకరణపై పెద్దగా దృష్టి సారించలేదు. దీంతో చాలా మంది పాత కార్డులనే వినియోగిస్తూ వచ్చారు. కొత్త కుటుంబాలు ఏర్పడటం, కుటుంబ సభ్యుల వివరాల్లో మార్పులు చోటు చేసుకోవడం వంటి కారణాలతో కొత్త కార్డుల అవసరం పెరిగింది. 2023లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా 2025 ఫిబ్రవరి నుంచి కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ, కుటుంబ సభ్యుల పేర్ల చేర్పులు, తొలగింపులు, ఇతర మార్పుల ప్రక్రియ వేగవంతం చేసింది. జిల్లాలో 2,80,409 మంది సభ్యులతో కూడుకొని 69,935 కొత్త రేషన్‌ కార్డులు జారీ చేశారు.

ఏటీఎం కార్డు తరహాలో..

నూతనంగా జారీ చేయనున్న రేషన్‌ కార్డులు క్రెడిట్‌, డెబిట్‌కార్డు సైజులో ఏటీఎం కార్డు తరహాలో తయారు చేశారు. స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఆకర్షణీయ రూపకల్పనతో పాటు భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని అరచేతిలో ఇమిడిపోయేలా రూపొందించారు. పేపర్‌ రూపం నుంచి ఎటీఎం కార్డుల తరహాలో రావడం ఇదే తొలిసారి. కార్డుపై ఎడమవైపు సీఎం రేవంత్‌రెడ్డి, కుడి వైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలను ముద్రించారు. క్యూఆర్‌ కోడ్‌ ఆధారంగా లబ్ధిదారు వివరాలను వేగంగా గుర్తించే అవకాశం ఉండటంతో రేషన్‌ పంపిణీ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఇప్పటివరకు వారు తీసుకున్న సరుకుల వివరాలు కన్పిస్తాయి. రేషన్‌ దుకాణానికి వెళ్లి క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి లేదంటే కార్డు నంబరు చెప్పి బయోమెట్రిక్‌ ద్వారా రేషన్‌ తీసుకోవచ్చు. భవిష్యత్తులో డిజిటల్‌ సేవలతో అనుసంధానం చేయడానికి కూడా ఈ స్మార్ట్‌ కార్డులు ఉపయోగపడే అవకాశం ఉంది.

జిల్లాలో ఇక స్మార్ట్‌ రేషన్‌ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన కార్డులను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఏటీఎం కార్డు పరిమాణంలో తయారు చేసిన ఈ కార్డులు ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. త్వరలో పంపిణీ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. – నారాయణఖేడ్‌/ సంగారెడ్డి జోన్‌

కార్డుపై క్యూఆర్‌తో పాటు ఎఫ్‌ఎస్‌సీ నంబర్‌

త్వరలో లబ్ధిదారులకు పంపిణీ

ఇప్పటికే జిల్లాకు చేరిన కార్డులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement