టేక్మాల్(మెదక్): మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎస్పీ శ్రుతికీర్తి ఆధ్వర్యంలో రాష్ట్ర విజిలెన్స్ బృందం శనివారం తనిఖీలు చేపట్టింది. ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, అమ్మకాల రికార్డులు, లైసెన్స్, ధరల పట్టికలు, రైతులకు బిల్లుల జారీ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, నాణ్యమైన ఎరువులను నిర్ణీత ధరలకే రైతులకు విక్రయించాలని అధికారులు సూచించారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని అవగాహన కల్పించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఎరువుల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యాప్ ద్వారా యూరియా ఎలా బుక్ చేసుకుంటున్నారు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఏఓ కోటేశ్వర్, మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్ పాల్గొన్నారు.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నీట్ పరీక్షా పత్రాల లీకేజీని నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు, రాహుల్‌గాంధీ చేసిన పోరాట ఫలితంగానే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఐబీ చౌరస్తా నుంచి పాతబస్టాండ్ వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈసందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మోదీ నివాసం ఎదుట రాహుల్‌గాంధీ ధర్నా చేసిన తర్వాతే ఈ ఉద్యమం మరింత ఉధృతమైందన్నారు. మోదీ పాలన 14 సంవత్సరాలు పూర్తయిందని బీజేపీ నాయకులు మిఠాయిలు పంచుకున్నారని.. నీట్ పరీక్ష పత్రం లీక్ కావడంతో 14 మంది మెరిట్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ పాలనలో విద్యా స్కాం జరిగిందని ఆరోపించారు. రాహుల్ ఎప్పుడు పిలుపు ఇచ్చినా సంగారెడ్డి కాంగ్రెస్ శ్రేణులు ఉద్యమాలకు సిద్ధంగా ఉంటారని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జెట్టి కుసుమ్‌కుమార్, తోపాజీ అనంతకిషన్, కూన సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి


