వర్గల్(గజ్వేల్): దూసుకొచ్చిన ‘బంతి’ని కాళ్లతో నియంత్రిస్తూ.. ప్రత్యర్థికి చిక్కకుండా గోల్‌పోస్టు వైపు పరుగులు తీస్తూ.. రీజినల్ జట్టులో స్థానమే లక్ష్యంగా క్రీడాకారులు చెలరేగారు. ఫుట్‌బాల్ విన్యాసాలతో ఆహూతులను అలరిస్తూ తుదిజట్టులో చోటు కోసం పోటీపడ్డారు. సిద్దిపేట జిల్లా వర్గల్ నవోదయ వేదికగా గురువారం రెండోరోజు రీజియన్ జట్ల ఎంపిక కోసం నిర్వహించిన క్రీడానైపుణ్య ప్రదర్శన పోటీలు అందరినీ అలరించాయి. బాల్ పాసింగ్, ఫార్వర్డ్ బ్లాక్, సెంటర్ ఫార్వర్డ్, గోల్ కీపింగ్, ఫ్లయింగ్ కిక్, కార్నర్ కిక్ తదితర అంశాలు, అందుకు సరైన ఆటగాళ్ల ఎంపిక లక్ష్యంగా కోచ్‌లు ఆటతీరును పరిశీలించారు.
ఐదు జట్లుగా ఎంపికలు
ఐదురాష్ట్రాల నవోదయ క్రీడాకారులు పాల్గొన్న ఈ సెలెక్షన్ మీట్‌లో బాలురకు అండర్ 14, 17, 19; బాలికలకు అండర్ 17, 19 కేటగిరీలుగా జట్ల ఎంపిక పరీక్షను కోచ్‌లు నిర్వహించారు. ఫుట్‌బాల్ స్టేడియంలో క్రీడాకారుల విన్యాసాలు పరిశీలిస్తూ మెరికలతో కూడిన జాబితా సిద్ధం చేశారు. కేటగిరీల వారీగా అయిదు జట్ల వివరాలను తుది పరిశీలన అనంతరం వెల్లడిస్తామని, శుక్రవారం రీజినల్ సెలెక్షన్ మీట్ ముగింపు కార్యక్రమం ఉంటుందని ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ తెలిపారు.
పోటాపోటీగా ఫుట్‌బాల్ నైపుణ్య ప్రదర్శన
నవోదయలో ఉత్సాహంగా సెలెక్షన్ మీట్
ఆకట్టుకున్న హరియాణ నృత్యం
వర్గల్(గజ్వేల్): రీజినల్ ఫుట్‌బాల్ సెలెక్షన్స్ మీట్ సందర్భంగా వర్గల్ నవోదయలో గురువారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. హర్యానా విద్యార్థినుల నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


