సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని నిజాంపూర్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న హెచ్‌ఎం రామకృష్ణ జాతీయ స్థాయి జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికై నట్లు శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కమలాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల19న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే జాతీయ విద్యావేత్తల విశిష్ట పురస్కారాలు 2026లో భాగంగా అవార్డులను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ప్రత్యేక అతిథిగా చలనచిత్ర నటుడు పృథ్వీరాజ్ హాజరై అవార్డులను అందజేస్తారని తెలిపారు. విద్యా, సామాజిక, పర్యావరణ రంగాల్లో చేసిన విశిష్ట సేవలకు గాను ఈ పురస్కారం రామకృష్ణకు అందజేస్తున్నట్లు వెల్లడించారు.
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని ఇశ్రితాబాద్ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఇశ్రితాబాద్ శివారులో వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో మొగుడంపల్లి మండలంలోని తొట్టితండాకు చెందిన విశాల్(20) తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రుడిని అంబులెన్సులో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం మండలంలోని ఎన్కేపల్లి శివారులో హల్ చల్ చేశాడు. గ్రామానికి చెందిన పలువురి యువకులపై రాళ్లతో దాడికి పాల్పడ్డాడు. యువకులు ప్రతిఘటించి తరమడంతో ఆడ వేషం ధరించి గ్రామ శివారులోని చెరువులోకి దూకాడు. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చెరువులో నుంచి బయటకు లాగారు. అనంతరం వ్యక్తి వివరాలను పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేయగా ఆ వ్యక్తి మాటలు రావని గుర్తించారు. దుస్తులు మార్పించి అక్కడి నుంచి పంపించారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
కల్హేర్(నారాయణఖేడ్): పేకాట ఆడుతున్న పదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మండల పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. కల్హేర్ ఎస్‌ఐ రవిగౌడ్ కథనం ప్రకారం... మండలంలోని ఫత్తేపూర్‌లో రహస్యంగా పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 10 మందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.16,130 నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిన్నారం (పటాన్‌చెరు): కలుషిత నీరు తాగడంతో మూగజీవి మృతి చెందింది. ఈ ఘటన గడ్డపోతారం పట్టణ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... అయ్యమ్మ చెరువు కింది భాగంలో ఆదివారం వీరారెడ్డిపల్లి సత్తయ్యకు చెందిన గేదె మృతి చెందింది. తూము నుంచి విడుదలైన పచ్చటి రంగు నీటిని తాగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పీసీబీ అధికారులు చర్యలు చేపట్టి బాధ్యులైన పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
హుస్నాబాద్: పట్టణంలో ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వివరాలు ఇలా... పట్టణంలోని నాగులమ్మ దేవాలయం బైపాస్ రోడ్డులో ఖాళీ ప్రదేశంలో చెట్ల పొదలు ఏపుగా పెరిగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి. స్థానికులు చూసి అగ్నిమాక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది వచ్చి పూర్తిగా మంటలను ఆర్పివేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. చుట్టు పక్కల ఇళ్లు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. గతంలో ఇదే బైపాస్ రోడ్డులో రెండు పర్యాయాలు గుబురుగా పెరిగిన పొదల్లో మంటలు చెలరేగాయి. ఖాళీ ప్రదేశాల్లో పిచ్చిమొక్కలు పెరగడం, అగ్నిప్రమాదాలకు గురికావడం పరిపాటిగా మారింది.


