మండల కేంద్రాల్లో మీ–సేవలు
మీ సేవతో ప్రయోజనం చేకూరేనా!
మెదక్‌జోన్: యూరియా బుకింగ్ కోసం యాప్ వాడరాని, స్మార్ట్‌ఫోన్ లేని రైతులు సమీపంలో గల మీ–సేవా కేంద్రానికి వెళ్లి బుక్ చేయించుకునే వీలును ప్రభుత్వం కల్పించింది. కానీ దీని ద్వారా ఎంత మాత్రం ఉపయోగం ఉండదని రైతులు వాపోతున్నారు. ఓ సెంటర్‌కు యూరియా వచ్చిన ఐదు నిమిషాల వ్యవధిలోనే బుకింగ్ పూర్తవుతుందని, మీ–సేవకు వెళ్లేవరకు ఎలా ఉంటుందని వాపోతున్నారు.
మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 3.67 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందుకు జిల్లాలకు 26, 500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని చెబుతున్నారు. కాగా జిల్లాలోని 37 పీఏసీఎస్ కేంద్రాలతో పాటు 120 పైగా ప్రైవేట్ డీలర్లు, 10 గ్రోమోర్ కేంద్రాల ద్వారా యూరియా సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు 10,943 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ నేటికి 30 శాతం మంది రైతులకు కూడా సరిపడా అందలేదని తెలిసింది.
యూరియా వచ్చిన ఐదు నిమిషాల్లోనే బుకింగ్ పూర్తి
వాట్సాప్‌లో పోస్టు చేస్తున్న అధికారులు
మీ–సేవకు వెళ్లే వరకు ఉంటాయా?
ఆందోళన చెందుతున్న రైతులు
జిల్లా వ్యాప్తంగా 21 మండలాలు 4 మున్సిపాలిటీలు ఉండగా.. మీ– సేవాకేంద్రాలు మాత్రం 63 ఉన్నాయి. అవి కూడా మండల కేంద్రాలు, మున్సిపాలిటీల పరిధిలో ఉన్నాయి. యూరియా కోసం వ్యవసాయ పనులు మానుకొని మండల కేంద్రాలకు వచ్చి మీ–సేవ ద్వారా బుక్ చేసుకోవటం ఎంతమాత్రం సాధ్యం కాదని అన్నదాతలు పేర్కొంటున్నారు. అంతే కాకుండా ఒక్కసారి యూరియా బుక్ అయితే మళ్లీ 20 రోజుల వరకు బుక్ కాదు. దీంతో పుణ్యకాలం ముగిసిపోతుందని ఆవేదన చెందుతున్నారు. ఆన్‌లైన్ బుకింగ్ పద్ధతిలో కాకుండా రైతు పట్టాదార్ పాస్‌బుక్ గల రైతులకు నేరుగా ఇచ్చి యూరియా కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.
ఐదు నిమిషాల వ్యవధిలోనే..
యూరియాను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు యాప్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. కాగా ఏదేని మండలానికి యూరియా వస్తే ఆ సమాచారాన్ని ఆ మండల వ్యవసాయశాఖ అధికారి మండల వాట్సాప్ గ్రూపులతో పాటు పలు గ్రామాల గ్రూపుల్లో సమాచారం పోస్టు చేస్తున్నారు. దీంతో స్మార్ట్‌ఫోన్ ఉండి పరిజ్ఞానం గల రైతులు ఐదు నిమిషాల ముందే ఫోన్‌లో యాప్‌ను ఓపెన్ చేసి సిద్ధంగా ఉంటున్నారు. సమయం కాగానే బుక్ చేసుకుంటుండటంతో కేవలం 5 నిమిషాల్లోనే ఆ సెంటర్‌కు వచ్చిన యూరియా బస్తాలు బుక్ అవుతున్నాయని వ్యవసాయశాఖ అధికారులే చెబుతున్నారు. అలాంటిది సదరు రైతులు మీసేవా వద్దకు వెళ్లి బుక్ చేసుకునే వరకు ఉంటాయా? అనే సందేహం వ్యక్తం అవుతుంది.


