కలెక్టర్ ప్రావీణ్య
పటాన్‌చెరు/రామచంద్రాపురం: విద్యార్థి జీవితంలో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అత్యంత కీలక దశగా కలెక్టర్ ప్రావీణ్య అభివర్ణించారు. ఆ సమయంలో కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నతస్థానాలకు చేరుకోవచ్చని ఆమె సూచించారు. శుక్రవారం పఠాన్‌చెరు మండలం ముత్తంగిలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ...ఇంటర్ తర్వాత ఉండే పోటీ పరీక్షలకు ఇప్పటి నుంచే సిద్ధమవ్వాలన్నారు. అందుకు ప్రభుత్వ అందిస్తున్న శిక్షణ తరగతులను ఇతర అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రతిష్టాత్మక కళాశాలల్లో సీట్లు సాధించాలని ఆకాంక్షించారు. చదువుతో పాటు ఆత్మవిశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణ కూడా ఎంతో అవసరమని ఆమె వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని తరగతి గదులు, స్టోర్ రూమ్, వంటగదిని పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేసిన చపాతీ మేకింగ్ మిషన్‌ను ప్రారంభించారు.
కాలనీల్లో కలెక్టర్ పర్యటన
రామచంద్రాపురం గ్రేటర్ పరిధిలోని ఆర్సీపురం పట్టణంలో కలెక్టర్ ప్రావీణ్య పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల అంశంపై స్థానికుల ఆసక్తిని తెలుసుకున్నారు. జి+5 మోడల్ నిర్మాణంపై వారి అభిప్రాయాలను సేకరించారు. పట్టణంలోని మార్క్స్ నగర్, ఇక్రిశాట్ కాలనీల్లో హౌసింగ్ పీడీ చలపతిరావుతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారా? ఇళ్ల అవసరం ఉందా లేదా అనే విషయాలను ఆమె స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట మాజీ కార్పోరేటర్ వెన్నవరం సింధూ, బీఆర్‌ఎస్ నాయకులు వెన్నవరం ఆదర్శరెడ్డి కూడా పాల్గొని స్థానిక పరిస్థితులను కలెక్టర్‌కు వివరించారు.


