వివరాలు సేకరిస్తున్నాం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధుల వ్యయం వ్యవహారం తెరపైకి రావడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నిధుల ఖర్చు తీరుపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అభ్యంతరాలు తెలుపుతుండటంతో అధికారులు ఈ అంశంపై దృష్టి సారించారు. జిల్లాలో ఉన్న కార్పొరేట్ సంస్థ పరిశ్రమలకు సంబంధించిన సీఎస్‌ఆర్ నిధుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎంతమొత్తంలో సీఎస్‌ఆర్ నిధులు ఖర్చు చేశారు? ఇంకా ఖర్చు చేయకుండా మిగిలిపోయిన నిధులు ఏమైనా ఉన్నాయా? ఆ నిధులను ఎక్కడ.. దేనికోసం ఖర్చు చేశారు? వివరాలు ఇవ్వాలని ఆయా పరిశ్రమల యాజమాన్యాలకు లేఖలు రాయాలని నిర్ణయించారు. అలాగే ఈ ఆర్థిక ఏడాది 2026–27లో ఎంతమొత్తంలో ఖర్చు చేయాలనే ప్లానింగ్ వివరాలను కూడా అడగాలని అధికారులు భావిస్తున్నారు.
70 భారీ పరిశ్రమల నుంచి సమాచార సేకరణ
జిల్లాలో కార్పొరేట్ కంపెనీలకు ఉత్పత్తి యూనిట్లు (పరిశ్రమలు) సుమారు 70 వరకు ఉంటాయి. ప్రధానంగా మహేంద్ర ట్రాక్టర్ల తయారీ యూనిట్ జహీరాబాద్‌లో ఉంది. ఎంఆర్‌ఎఫ్ లిమిటెడ్ కంపెనీకి చెందిన యూనిట్ సదాశివపేటలో ఉంది. తొషీబాకు చెందిన ట్రాన్స్‌ఫార్మర్ యూనిట్ పటాన్‌చెరు పరిధిలో ఉంది. అలాగే హెటిరో డ్రగ్స్, ఎంఎస్‌ఎన్, అరబిందో, కోవాలెంట్ వంటి ప్రముఖ ఫార్మా కంపెనీల యూనిట్లు పదుల సంఖ్యలో జిల్లావ్యాప్తంగా పలు చోట్ల ఉన్నాయి. ఇలా సుమారు 70కి పైగా కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన పరిశ్రమలు జిల్లాలోనే ఉన్నాయి. ఈ పరిశ్రమల యాజమాన్యాలు సీఎస్‌ఆర్ కింద తమ లాభాల్లో రెండు శాతం స్థానిక ప్రజల అవసరాల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నిధుల ఖర్చు విషయంలో వివాదానికి దారితీసే అవకాశాలు ఉండటంతో అధికార యంత్రాంగం ఈ దిశగా చర్యలు చేపట్టింది.
కలెక్టర్ ప్రత్యేక చొరవ
ఈ సీఎస్‌ఆర్ నిధుల విషయంలో గతంలో లెక్కా పత్రం లేకుండా పోయేది. ఆయా కంపెనీలు ఎక్కడ ఖర్చు చేస్తున్నాయో? ఎంత ఖర్చు చేస్తున్నాయో? జిల్లా అధికారుల వద్ద కనీసం సమాచారం కూడా ఉండేది కాదు. కలెక్టర్‌గా ప్రావీణ్య బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లాస్థాయి అధికారులతో కమిటీలు వేశారు. ఆయా కంపెనీల, సీఎస్‌ఆర్ నిధుల వివరాలు సేకరించడంతోపాటు, ఆయా నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులపై ఆయా శాఖల ఇంజనీరింగ్ అధికారులతో పర్యవేక్షణ కూడా పెంచారు.
సీఎస్‌ఆర్ నిధుల ఖర్చుపై ఎమ్మెల్యే ‘గూడెం’ అభ్యంతరాలు
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
ఆయా కంపెనీల నుంచి ఈ నిధుల ఖర్చు వివరాల సేకరణ
సీఎస్‌ఆర్ నిధుల ఖర్చు విషయంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం విదితమే. పటాన్‌చెరు నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలతో తమ ప్రాంతంలో కాలుష్య కోరల్లో చిక్కుకుందని, ఈ కాలుష్యం కారణంగా స్థానికులు అనేకమంది క్యాన్సర్ వంటి రోగాల బారిన పడుతున్నారని గూడెం ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఈ పరిశ్రమల సీఎస్‌ఆర్ నిధులను మాత్రం మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆందోల్ నియోజకవర్గంతోపాటు, నల్లగొండ, వరంగల్ జిల్లాలకు తరలిపోతున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అధికారులు ఈ నిధుల ఖర్చుపై ఆరా తీస్తున్నారు.
జిల్లాలో ఉన్న కార్పొరేట్ కంపెనీలకు చెందిన పరిశ్రమల యాజమాన్యాలు ఖర్చు చేస్తున్న సీఎస్‌ఆర్ నిధుల వివరాలను సేకరిస్తున్నాం. ప్రత్యేకంగా తయారు చేసిన ఫార్మాట్‌లో ఈ సమాచారం తీసుకుంటున్నాం. ఈ సమాచారాన్ని అంతా క్రోడీకరించి కలెక్టర్‌కు నివేదిక అందజేస్తాం. –తుల్జ్యానాయక్,
జిల్లా పరిశ్రమల కేంద్రం, జీ.ఎం.


