రూ.16 కోట్లతో ప్రారంభమైన రివిట్‌మెంట్ పనులు రూ.180 కోట్లతో పంట కాల్వల సిమెంట్ లైనింగ్ పనులు పెద్దారెడ్డిపేట లిఫ్టు సర్వే పనులకూ ప్రాధాన్యం నిధుల కోసం మంత్రి దామోదర చొరవ
పుల్‌కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టు పటిష్టతకు మరమ్మతు పనులు ప్రారంభంకావడంతో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో నిధులు ఏ మేరకు కేటాయిస్తారోనని నీటిపారుదల శాఖ అధికారులు ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్టు జాతీయ భద్రత అధికారుల సూచనమేరకు డ్యామ్ మట్టికట్ట లోపలి భాగంలో రాతికట్ట (రివిట్‌మెంట్)పనులను చేపట్టారు. తొలుత 800 మీటర్ల మేరకు మరమ్మతు పనులు చేపట్టాలని నిర్ణయించి రూ.16 కోట్లను కేటాయించారు. ఐతే పనులు చేపట్టడానికి నీరు అడ్డంకిగా మారడంతో నీటిని దిగువకు వదిలిపెట్టారు. తాగునీటికి ఈ వేసవిలో సరిపోను నీరుంచి మిగతా నీటిని వదిలిపెట్టారు. నీటిని దిగువకు వదిలిపెట్టడం, పైగా ప్రాజెక్టు ఆయకట్టుకు పంట విరామం ప్రకటించడంతో డ్యామ్ రాతికట్ట మొత్తం మరమ్మతు చేయాలని నిర్ణయించారు. దీంతో మరమ్మతుల అంచనావ్యయం పెరిగిందని అధికారులు తెలిపారు. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్నారు.
మంత్రి ప్రత్యేక చొరవ
మంత్రి దామోదర నియోజకవర్గంలోనే సింగూరు డ్యామ్ ఉండటంతో ప్రాజెక్టు పనులపై ఆయన ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40 వేల ఎకరాలకు సాగునీటి కాలువలు మంజూరు చేయించారు. దశాబ్దం నుంచి రైతులకు సాగునీరు పారిస్తున్న కాలువలకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో కాలువల్లో పూడిక నుంచి చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. దీంతో మంత్రి దామోదర రాజనర్సింహ పంటకాలువలకు సిమెంట్ లైనింగ్ చేయించాలని రూ.180 కోట్లను మంజూరు చేయించారు. సిమెంట్ లైనింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. డ్యామ్ రాతికట్ట రివిట్‌మెంట్ పనులు, పంట కాలువలకు సిమెంట్ లైనింగ్ పనులు ఏకకాలంలో ప్రారంభం కావడంతో ఎక్కువగా నిధులు అవసరమవుతాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు బడ్జెట్ అంచనాలను ఆర్థిక శాఖకు పంపించారు.
మంత్రుల ప్రత్యేక సమీక్ష
సింగూరు ప్రాజెక్టు మరమ్మతు పనులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, స్థానిక మంత్రి దామోదర రాజనర్సింహ నీటి పారుదల శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మరమ్మతు పనులు త్వరగా పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. డ్యామ్ మిషన్ భగీరథ, సాగునీటి అంశాలతో కూడుకున్నది కావడంతో పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.
పెద్దారెడ్డిపేట లిఫ్టుకు అంకురార్పణ
ప్రాజెక్టు నుంచి కుడి ఎడమ కాలువల ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నందున ఎగువభాగంలోని ఖాదిరాబాద్, రేగోడ్, వట్‌పల్లి, టేక్మాల్ ప్రాంతాలలోని రైతులకు సాగునీరు అందిచాలని సంకల్పించి పెద్దారెడ్డిపేట వద్ద లిఫ్టును ఏర్పాటుకు సంకల్పించారు. ఈ లిఫ్టు సర్వే కోసం ఈ బడ్జెట్‌లోనే నిధుల కేటాయింపులుంటాయని అధికారులు భావిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో సింగూరు ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిస్తారని ఆశిస్తున్నారు.


