నర్సాపూర్: వేప చెట్లకు చీడ తగ్గినా పూర్తి స్థాయిలో పూత పూయలేదు. సుమారు ఏడాది క్రితం వేప చెట్లకు చీడ పట్టడం మొదలైంది. వేప చెట్లు ఎండిపోవడానికి ఫోమాప్సిస్ అజాడిరక్టె అనే ఫంగస్ కారణమని, దీనిని డైబ్యాక్ వ్యాధి అంటారని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాగా, వేప చెట్టుకు ఆయూర్వేదంలో సర్వరోగ నివారిణిగా పేర్కొంటారు. అలాగే.. వ్యవసాయంలో పలు రకాల పంటలకు పట్టె చీడను వదిలించేందుకు వేప ఆకులు, గింజలతో తయారు చేసే కషాయం వాడి చీడను వదిలించే అవకాశం ఉండగా.. అలాంటి వేపకు చీడ పట్టడం గమనార్హం. సుమారు ఏడాది క్రితం నుంచి వేప చెట్లకు చీడ పట్టి వాటి ఆకులకు తెల్లటి చుక్కలాంటి మచ్చలు ఏర్పడడంతో పాటు ఆకులు ఎండిపోయి రాలిపోయాయి. ఆకులన్ని రాలిపోవడంతో దశాబ్దాల నాటి వయస్సున్న వేప చెట్లు సైతం ఆకులు రాలి కొమ్మలుగా మారి ఎండుముఖం పట్టాయి. ఇటీవల వేప చెట్లకు చీడ తగ్గుముఖం పట్టడంతో మళ్లీ ఆకులు చిగురించి చెట్లు నిండుగా కన్పిస్తున్నప్పటికి కొన్ని కొమ్మల ఆకులు ఎండుముఖంతోనే ఉన్నాయి. కాగా, వేప చెట్లకు చీడ పట్టి ఎండిపోయి ఇటీవల చిగురిస్తున్నా. చాలా చెట్లకు పువ్వు పూయ లేదు.


