పైసా వసూల్‌! | - | Sakshi
Sakshi News home page

పైసా వసూల్‌!

Mar 20 2026 10:06 AM | Updated on Mar 20 2026 10:06 AM

తరచూ ఏసీబీకి పట్టుబడుతున్న అవినీతి జలగలు అయినా మారని తీరు పలు శాఖల్లో ఇదే తంతు తాజాగా అవినీతి నిరోధక శాఖకు చిక్కిన పెద్దేముల్‌ ఆర్‌ఐ

వికారాబాద్‌: సీఎం సొంత జిల్లాలో అవినీతి వ్యవస్థీకృతం అయ్యిందనే వాదన వినిపిస్తోంది. కీలక శాఖల్లో విధులు నిర్వహించే మెజార్టీ అధికారులు లంచావతారమెత్తుతున్నారు. తరచూ వెలుగు చూస్తున్న ఘటనలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. గతంలో కలెక్టరేట్‌లో విధులు నిర్వహించే ఓ మహిళా ఉద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కి ఆరు నెలలు తిరక్కుండానే అదే రెవెన్యూ శాఖలో చేరి మరోసారి పట్టుబడింది. తాజాగా పెద్దేముల్‌ ఆర్‌ఐ ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది. గతంలో ఎస్పీ కార్యాలయంలో ఓ డీఎస్పీ, తాండూరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఓ తహసీల్దార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టుబడిన ఘటనలు ఉన్నాయి. పెద్దేముల్‌ ఆర్‌ఐ హైదరాబాద్‌లో ఓ రైతు నుంచి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మాటువేసి పట్టుకున్నారు. అయితే అధికారుల తీరు దొరికితే దొంగ లేకుంటే దొర అన్న చందంగా తయారైంది. ప్రధానంగా రెవెన్యూ ఖాఖలో ఆర్‌ఐలు మొదలుకుని డీటీలు, తహసీల్దార్లు, ఇతర ఉన్నతాధికారుల వరకు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏ ఫైలు కదలాలన్నా..? నివేదిక ఇవ్వాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ఏదైనా పని పడితే కింది స్థాయి ఉద్యోగులను కూడా వదలడం లేదు. వారి రిపోర్టు ఇవ్వటానికి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూనియర్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, భూ భారతి ఆపరేట్లర్లు, సర్వేయర్లు ఇలా ప్రతి ఒక్కరూ అదే దారిలో నడుస్తున్నారు.

నేతల అండదండలు

అవినీతి అధికారులకు నేతలు, ప్రజా ప్రతినిధుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులకు ముడుపులు చెల్లించి పోస్టింగులు వేయించుకొని ఆయా ప్రాంతాలకు వస్తున్న అధికారులు ఆ తర్వాత వసూళ్లకు పాల్పడుతున్నారు. నేతల అండదండలున్నాయనే ధైర్యంతో ఉన్నతాధికారులను కూడా లెక్కచేయడం లేదు. కొంతమంది పర్యవేక్షణాధికారులు కింది స్థాయి అధికారుల అవినీతిలో భాగస్వాములు అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్‌ అధికారులు ఏసీబీ అధికారుల నిఘాలో ఉన్నట్లు సమాచారం.

ప్రతి పనికీ డబ్బు డిమాండ్‌ చేస్తున్న అధికారులు

మెజారిటీ శాఖల్లో..

ఆరు నెలల క్రితం కలెక్టరేట్‌లోని ఓ ఉద్యోగి లంచం తీసుకుంటూ పట్టుబడింది. ఎనిమిది నెలల క్రితం పోలీసు శాఖలో పనిచేసే ఎస్‌ఐ, అతని డ్రైవర్‌ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. 11 నెలల క్రితం తాండూరులో ఇద్దరు రెవెన్యూ అధికారులపై కేసులు నమోదయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement