ప్రజలకు ఉపయోగపడని శౌచాలయాలు
జహీరాబాద్ టౌన్: అత్యవసర సమయాల్లో ప్రజలు మల మూత్రవిసర్జనకు వీలుగా ప్రజా మరుగుదొడ్లను నిర్మించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో శౌచాలయాలు నిర్మించి వాటి నిర్వహణను మాత్రం గాలికొదిలేశారు. దీంతో పలు చోట్ల నిరుపయోగంగా మారాయి. వినియోగంలో ఉన్న చోట శుభ్రత, వసతులు కరువయ్యాయి. స్వచ్ఛభారత్ పథకం కింద పట్టణంలోని నాలుగేళ్ల క్రితం ప్రజామరుగుదొడ్లను కట్టించారు. వీటి నిర్వహణ బాధ్యతలను పొదుపు సంఘాల సభ్యులకు అప్పగించారు. జనావాసాలకు దూరంగా పట్టణ సమీపంలో బీదర్ చౌరస్తాలో నిర్మించిన మరుగుదొడ్లు వాడుకలో లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. పర్యవేక్షణ లేకపోవడంతో మరుగుదొడ్లు దెబ్బతిని లక్ష్యం నీరుగారింది. దీంతో ప్రజాధనం వృథా అయింది. పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం వద్దనున్న మరుగుదొడ్ల నిర్వహణ కూడా సరిగ్గాలేదు. జన సంచారం తక్కువగా ఉన్నందున మరుగుదొడ్లను ఉపయోగించుకునే వారు కరువయ్యారు.
అవసరమున్న చోట అరకొర
జహీరాబాద్ పట్టణంలో 1.25 లక్షల జనాభా ఉండగా..పట్టణానికి పరిసర ప్రాంతాల నుంచి ప్రతీరోజు సుమారు 25 వేలమంది వస్తుంటారు. ప్రధాన రహదారులు, వీధులు ప్రజలతో కిక్కిరిపోతుంది. రోడ్ల ప్రక్కన సరిపడా మరుగుదొడ్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసరమున్న చోట అరకొర..జన సంచారం లేని ప్రాంతంలో మరుగుదొడ్లు నిర్మించారని విమర్శలు వస్తున్నాయి. జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని టాయిలెట్లు కట్టాలని కోరుతున్నారు.


