అక్రమ సిలిండర్ల స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

అక్రమ సిలిండర్ల స్వాధీనం

Mar 14 2026 10:24 AM | Updated on Mar 14 2026 10:24 AM

నర్సాపూర్‌: అక్రమంగా వాడుతున్న గ్యాస్‌ సిలిండర్లను పట్టుకున్నట్లు విజిలెన్స్‌ అండ్‌ సివిల్‌ సప్లయి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ వెంకటేశం తెలిపారు. శుక్రవారం ఆయన తన బృందంతో పట్టణంలోని హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, టీ పాయింట్లు, పాస్ట్‌ఫుడ్‌ సెంటర్లతో పాటు వంట గ్యాస్‌ వినియోగించే పలు వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గృహ అవసరాలకు వినియోగించాల్సిన సబ్సిడీ వంట గ్యాస్‌ను వ్యాపార సంస్థల్లో వాడటం గుర్తించి 46 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నామని, 29 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. తాము పట్టుకున్న సిలిండర్లలో 38 హెచ్‌పీ, భారత్‌ కంపెనీకి చెందిన 6 , రెండు ఇండెన్‌కు చెందిన సిలిండర్లు ఉన్నాయన్నారు. తనిఖీల్లో ఇన్‌స్పెక్టర్‌ పాండరి, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, సాంబశివరావు, ఏఎస్‌ఓ నిస్సార్‌, డీటీ నాగరాజు, ఆర్‌ఐ నర్సింహులు పాల్గొన్నారు.

పెట్రోల్‌ బంకు తనిఖీ

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): మండల కేంద్రమైన చిలప్‌చెడ్‌, చిట్కుల్‌ గ్రామాల్లోని పెట్రోల్‌ బంక్‌లను ఆర్‌ఐ సునీల్‌ చౌహాన్‌ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చమురు నాణ్యత, స్టాక్‌ను పరిశీలించారు. స్టాక్‌ ఎప్పుడు వస్తుంది? ఎంత వస్తుంది? రోజు ఎంత చమురు అమ్ముతారని ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కస్టమర్‌లకు ఎలాంటి లోటు లేకుండా నిల్వ ఉంచుకోవాలన్నారు. అలాగే పెట్రోల్‌ బంకుల వద్ద వాహనాలకు గాలినింపే యంత్రాన్ని అందుబాటులో ఉంచడంతో పాటు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పెట్రోల్‌ బంకుల నిర్వాహకులు పాల్గొన్నారు.

చికిత్స పొందుతూ

వ్యక్తి మృతి

మిరుదొడ్డి(దుబ్బాక): చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. మిరుదొడ్డి ఎస్‌ఐ సమత వివరాల ప్రకారం... దౌల్తాబాద్‌ మండలం లింగరాజు పల్లి గ్రామానికి చెందిన సున్నపు బుచ్చయ్య (52) ఇటీవల దుబ్బాకలో సొంత పనులు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. ఈ క్రమంలో సిద్దిపేట నుంచి మెదక్‌ వైపు వెళ్తున్న కారు ధర్మారం జాతీయ రహదారి మిరుదొడ్డి చౌరస్తా వద్ద బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన బుచ్చయ్యను ములుగులోని ఆర్వీఎం ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.

ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చెందిన..

గజ్వేల్‌రూరల్‌: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ(ఎర్రవల్లి)లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పేర్ల గణేశ్‌(45) కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో కుటుంబంలో నెలకొన్న కలహాలతో తీవ్ర మనోవేదనకు గురై మూడ్రోజుల క్రితం ఇంట్లో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆర్‌వీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.

గుర్తుతెలియని మృతదేహం..

జిన్నారం (పటాన్‌చెరు): గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన జిన్నారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దాదిగూడెం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్సై హనుమంతు వివరాల ప్రకారం... వ్యవసాయ క్షేత్రాల సమీపంలోని ఓ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని బయటకి తీసి, కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement