● గడిపెద్దాపూర్, కన్‌సాన్‌పల్లి మత్స్యకారుల మధ్య వివాదం
● మత్స్యశాఖ అధికారి జోక్యంతో సద్దుమణిగిన వైనం
వట్‌పల్లి(అందోల్): ఒక చేపల చెరువు రెండు గ్రామాల మధ్య వివాదానికి కారణమైంది. ఈ చెరువులో కేవలం ఒక గ్రామానికి చెందిన వారు మాత్రమే చేపలు పడుతుండటం మరో గ్రామంవారికి ఆగ్రహం కలిగించింది. తమకూ చెరువులో చేపలు పట్టేందుకు హక్కు ఉందని అందుకు అవకాశమివ్వాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అందోల్ మండలం కన్‌సాన్‌పల్లిలో శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలం గడిపెద్దాపూర్, సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం కన్‌సాన్‌పల్లి గ్రామాల మధ్య చెరువు విస్తరించి ఉంది. ఇటీవల గడిపెద్దాపూర్ మత్స్యకారుల తమ గ్రామంప పేరిట సహకార సంఘం ఏర్పాటు చేసుకోగా...అదే సహకార సంఘంలో తమకూ సభ్యత్వం కావాలని కన్‌సాన్‌పల్లి గ్రామానికి చెందిన మత్స్యకారులు అడిగారు. అయితే వారిని తమ సంఘంలో చేర్చుకోకపోవడంతో ఆందోళనకు దిగారు. ఇటీవల కన్‌సాన్‌పల్లి గ్రామానికి చెందిన 33 మంది మత్స్యకారులకు మత్స్యసహకార సంఘంలో సభ్యత్వ నమోదుకు మత్య్సశాఖ అధికారులు అవకాశం ఇవ్వాలని చెప్పినప్పటికీ గడిపెద్దాపూర్ గ్రామస్తులు అధికారుల ఆదేశాలను పెడచెవిన పెట్టి తమ సహకార సంఘం తరఫున చేపలను చెరువులో వదిలారు. ఈ క్రమంలో శుక్రవారం చేపలను పట్టేందుకు గడిపెద్దాపూర్ గ్రామస్తులు చెరువులోకి దిగారు. విషయం తెలుసుకున్న కన్‌సాన్‌పల్లి గ్రామస్తులు అక్కడకు చేరుకుని వారిని అడ్డుకున్నారు. దీంతో రెండు గ్రామాల ప్రజలు ఘర్షణకు దిగడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
సర్దిచెప్పిన మత్స్యశాఖ అధికారి
కన్‌సాన్‌పల్లిలో గొడవ జరుగుతున్న విషయం తెలుసుకున్న మెదక్ మత్స్యశాఖ అధికారులు వెంటనే ఓ అధికారిని చెరువు వద్దకు పంపించారు. ఇరు గ్రామాల మత్స్యకారులతో సమావేశమైన సదరు అధికారి కన్‌సాన్‌పల్లి మత్స్యకారులను కూడా పెద్ద చెరువు సహకార సంఘంలో చేర్చుకోవాలని ఒక్క గ్రామానికి చెందిన మత్స్యకారులే చేపలు పట్టడం సరికాదని గడిపెద్దాపూర్ మత్య్సకారులకు హితవు పలికారు. చెరువు వివాదం ముగిసే వరకు రెండు గ్రామాల మత్స్యకారులు చేపలు పట్టవద్దని తేల్చిచెప్పారు. దీంతో వివాదం సద్దుమణగడంతో ఇరు గ్రామాల మత్స్యకారులు చెరువు వద్ద నుంచి వెళ్లిపోయారు.


