● మూడు నెలలుగా అందని జీతాలు
● జీపీ వర్కర్స్ యూనియన్ జిల్లా నేత బాల్‌నర్సయ్య
కొండపాక(గజ్వేల్): ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో ప్రజలకు చేర్చుతున్న వారిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని జీపీ వర్కర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు అమ్ముల బాల్‌నర్సయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలను వెంటనే చెల్లించాలని కొండపాక, కుకునూరుపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయాల ఎదుట శుక్రవారం పంచాయతీ సిబ్బందితో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో జీపీ కార్మికులు పూటగడవని దుస్థితి నెలకొందన్నారు. అధికారంలోకి రాగానే ఉద్యోగ భద్రత కల్పిస్తామంటూ, గ్రీన్ చానల్ ద్వారా వేతనాలను నేరుగా అకౌంట్లో జమచేస్తామన్న మాటలు మర్చిపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరును వ్యతిరేకిస్తూ త్వరలో చేపట్టే పోరాటాలకు కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యాలయాల్లో వినతిపత్రాలను అందజేశారు. వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆరుట్ల నర్సింహులు, బోగి సాయికుమార్, నాగరాజు, పల్లె శ్రీనివాస్, లక్ష్మి, వెంకటనర్సవ్వ, కనకవ్వ, రమణాచారి, చంద్రయ్య, ఎల్లయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


