సమాధుల ధ్వంసం
● అర్ధరాత్రి కూల్చి అస్థికలు తీసుకెళ్లిన వైనం
● పోలీసులకు ఫిర్యాదు
సంగారెడ్డి : తరతరాల నుంచి సొంత భూమిలో ఉన్న తాతలు, తండ్రుల సమాధులను అర్ధరాత్రి కూల్చివేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బాధితుడి కథనం ప్రకారం... సంగారెడ్డిలోని గణేశ్‌నగర్‌లో పృథ్వీసాగర్ అనే వ్యక్తికి నాలుగు గుంటల సొంత భూమి ఉంది. అందులో ఉన్న వారి పూర్వీకుల సమాధులను డిసెంబర్ 27న అర్ధరాత్రి సతీశ్ అనే వ్యక్తి దుర్గేశ్‌కు మద్యం తాగించి, జేసీపీ ఓనర్ సత్యంతో కలిసి ధ్వంసం చేశారని బాధితుడు పృథ్వీ సాగర్ ఆరోపించారు. జేసీబీతో కూల్చివేసి, అందులోని అస్థికలను కూడా టిప్పర్లలో ఎత్తి తీసుకెళ్లారని తెలిపారు. ఈ ఘటన మానవత్వాన్ని మంటగలిపేలా ఉందని, తమ కుటుంబ మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.


