పంట రుణాల కోసం ఇక్కట్లు
శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రం శివ్వంపేటలో ఇండియన్ బ్యాంకులో క్రాప్‌లోన్స్ పొందేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోన్ తీసుకునేందుకు నిత్యం బ్యాంకు చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. పలువురు రైతులు పాత క్రాప్‌లోన్ డబ్బులు చెల్లించి, కొత్తగా రుణాలు పొందేందుకు అవసరం ఉన్న పత్రాలు సమర్పించి నెలలు గడుస్తున్నా.. బ్యాంకు సిబ్బంది రుణాలు మంజూరు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. దరఖాస్తు పత్రాలు సైతం బ్యాంకులో ఇవ్వకపోవడంతో డబ్బులు వెచ్చించి బయట నుంచి కొనుగోలు చేస్తున్నారు. బ్యాంకుకు సంబంధించి రుణాలు పొందేందుకు అవసరం ఉన్న ఇతర దరఖాస్తు, ష్యూరిటీ పత్రాలు సైతం బయట ఆన్‌లైన్ సెంటర్ల నుంచి రైతులు డబ్బులు ఖర్చు చేసి తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అన్ని పత్రాలు బ్యాంకులో సమర్పించినా రుణాల కోసం నెలల తరబడి తిరగాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాబై ఏళ్ల క్రితం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇండియన్ బ్యాంకు ప్రస్తుత జనాభా, ఖాతాదారులకు అనుగుణంగా సేవలు విస్తరించాలని ప్రజలు కోరుతున్నారు. వృద్ధులు, మహిళలు బ్యాంకుకు వెళ్తే వారు కూర్చునేందుకు కనీస సదుపాయాలు లేక గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు.
ఇండియన్ బ్యాంకులో రద్దీ
బ్యాంకు చుట్టూ తిరుగుతున్న రైతులు


