వడివడిగా స్మార్ట్‌ సిటీ పనులు | - | Sakshi
Sakshi News home page

వడివడిగా స్మార్ట్‌ సిటీ పనులు

Jan 3 2026 8:36 AM | Updated on Jan 3 2026 8:36 AM

వడివడిగా స్మార్ట్‌ సిటీ పనులు

వడివడిగా స్మార్ట్‌ సిటీ పనులు

ప్రాజెక్టుతో పారిశ్రామిక

అభివృద్ధి వేగవంతం

హైదరాబాద్‌–నాగపూర్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌

ముగిసిన టెండర్‌ ప్రక్రియ

3,245 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు

సంగారెడ్డి జోన్‌: పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించి, పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జహీరాబాద్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఝరాసంగం, న్యాల్‌కల్‌ మండలాల పరిధిలో ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వం 2024 ఆగస్టులో ప్రాజెక్టు ఏర్పాటును ప్రకటించింది. అయితే అందుకు తగినట్లుగా నిధుల కేటాయింపు జరగకపోవడంతో గతేడాది సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్‌ గోయెల్‌ను కలిసి ప్రాజెక్టు అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. దీంతో నిధులు మంజూరు కావడంతో పనులు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మొదటి దశలో 3,245 ఎకరాల్లో

నిమ్జ్‌ ప్రాంతంలోని ఝరాసంగం, న్యాల్‌కల్‌ మండలాల్లోని 17గ్రామాల పరిధిలో సుమారు 12,500 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. అయితే మొదటి దశలో రెండు మండలాల్లోని బర్దిపూర్‌, ఎల్గోయి, చీలపల్లి, చీలపల్లి తండా, ముంగి, రుక్మాపూర్‌ గ్రామాల పరిధిలో 3,245 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కాబోతుంది. ఇప్పటికే అభివృద్ధి కోసం సంబంధిత అధికారులకు భూములను అప్పగించారు. దీని కోసం రూ.2,369 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతాయి. పనులకు సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించారు.

మౌలిక వసతుల కల్పనకు చర్యలు

పరిశ్రమలకనుగుణంగా అవసరమయ్యే మౌలిక వసతులు ఏర్పాటు దిశగా ప్రాజెక్టు ఏర్పాటు కాబోతుంది. హైదరాబాద్‌–నాగపూర్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ ఇంప్లిమెంటేషన్‌లో భాగంగా ప్రాజెక్టును నెలకొల్పుతున్నారు. ఎస్‌ఆర్‌ఆర్‌ డెవలప్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు టెండర్‌ను దక్కించుకుంది. ఈ మేరకు పనులు చేసే ప్రాంతంలో కంటైనర్‌లలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. పారిశ్రామిక, లాజిస్టిక్స్‌, నివాసం, గ్రీనరీ, రహదారులు, వాటర్‌ ట్యాంకులు, రహదారులు, విద్యుత్‌ తదితర అభివృద్ధి పనులు జరుగుతాయి. మరో వారం రోజుల్లో శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

పూర్తికావస్తున్న భూ సేకరణ ప్రక్రియ

పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం నిమ్జ్‌ ప్రాజెక్టుకు అవసరమయ్యే భూమిని సేకరించేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 12 వేలకు ఎకరాలకు పైగా భూమి అవసరం ఉండగా ఇప్పటికే సుమారు 9వేల ఎకరాల వరకు సేకరణ పూర్తయినట్లు సమాచారం. గత రెండేళ్లలో 6వేల ఎకరాల భూమిని సేకరించారు. మిగతా భూ సేకరణ ప్రక్రియ సైతం కొనసాగుతుంది. త్వరలో ఈ ప్రక్రియ సైతం పూర్తయ్యే అవకాశాలున్నాయి.

నిమ్జ్‌ ప్రాజెక్టు పూర్తయితే పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగవంతం కానుంది. ఇప్పటికే వెమ్‌ టెక్నాలజీతో పాటు హుందాయి పరిశ్రమల కోసం భూములను కేటాయించారు. నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ ట్రస్ట్‌, తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌లు భాగస్వామ్యంతో పనులు చేపడతాయి. ప్రాజెక్టు పూర్తితో సుమారు 2లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement