మున్సిపల్ ఎన్నికల సందడి షురూ
● జహీరాబాద్ బల్దియాకు ఏడేళ్ల తర్వాత ఎన్నికలు
● ఓటరు జాబితాను రూపొందిస్తున్న అధికారులు
జహీరాబాద్ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల ఎన్నికలకు సిద్ధమవుతుండటంతో జహీరాబాద్‌లో హడావుడి కనిపిస్తోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయనే ప్రచారంతో అధికారులు కూడా యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తుండటంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పోటీ సిద్ధమవుతున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితాను వార్డుల వారీగా ఖరారు చేయడానికి అధికారులు ముసాయిదా ఓటరు జాబితాను రూపొందించారు. ఏమైనా సలహాలు అభ్యంతరాలుంటే ఈ నెల 5 తేదీ సాయంత్రం 5 గంటలలోపు కార్యాలయంలో అందజేయాలని మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్ కోరారు. దీంతో జహీరాబాద్ బల్దియాకు ఏడేళ్ల అనంతరం ఎన్నికలు జరగనున్నాయి. జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిని పెంచడానికి సమీపంలో ఉన్న అల్లీపూర్, రంజోల్,పస్తాపూర్, చిన్న హైదరాబాద్,హోతి(కె) గ్రామ పంచాయతీలను మున్సిపల్‌లో విలీనం చేశారు. తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయరాదంటూ హోతి(కె) గ్రామస్తులు కోర్టును ఆశ్రయించడంతో 2019లో ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో ఏడేళ్ల నుంచి అక్కడ ప్రత్యేక పాలన కొనసాగుతుంది. అయితే హోతి(కె) గ్రామస్తులు వేసిన పిటిషన్‌ను హైకోర్టులో కొట్టివేసింది. ఆ తర్వాత గ్రామస్తులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా లిస్ట్ కాలేదని సమాచారం. ఇప్పటికే అధికారులు ముసాయిదా ఓటరు జాబితాను రూపొందించారు.


