ఊరికో సమాఖ్య భవనం
నారాయణఖేడ్: మహిళా సాధికారితకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం తాజాగా మహిళా సంఘాలకు ‘సమాఖ్య భవనాల’నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలకుశాశ్వత వేదికగా ఉండేలా భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. ఈ భవనాల నిర్మాణ పనులు వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటుంది. ప్రతీ గ్రామంలో మహిళా పొదుపు సంఘం (ఎస్‌హెచ్‌జీ)కి సమాఖ్య భవనాన్ని నిర్మించనుంది. సంక్రాంతి తర్వాత భవనాల నిర్మాణ పనులను రాష్ట్రంలో ఏదో ఓ చోట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన అనంతరం జిల్లాలో భవనాల నిర్మాణాలు చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుండటంతో భవనాల నిర్మాణ పనులు సైతం ఆయా మహిళా సంఘాలకే అప్పగించనున్నారు. గ్రామస్థాయి మహిళా సమాఖ్య భవనాల కోసం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 613 గ్రామ పంచాయతీలు ఉండగా 1.94లక్షల మంది సభ్యులతో 18,848 మహిళా సంఘాలు..613 గ్రామాఖ్య సంఘాలు కొనసాగుతున్నాయి.
స్వయం సమృద్ధి దిశగా..
ప్రభుత్వం మహిళా సంఘాలకు విద్యార్థులకు దుస్తులు కుట్టే పనితోపాటు పలు పథకాల కింద మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తుంది. మహిళా సంఘాలు టెస్కో ద్వారా వచ్చిన వస్త్రాలను నిల్వ చేసి తమ సభ్యుల ద్వారా కుట్టిస్తున్నారు. ఈ విధానంలో కొన్ని సమస్యలు తలెత్తడంతో మహిళా సమాఖ్యలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో మహిళలకు దుస్తులు కుట్టడంతోపాటు పలు మార్గల్లో ఉపాధిని అందించేలా ప్రత్యేకంగా భవనాలు నిర్మించేందుకు ఆ సంస్థ ప్రతిపాదించగా అందుకు ప్రభుత్వం ఆమోదించింది.
ఒక్కో భవనానికి రూ.10లక్షలు
గ్రామస్థాయిలో నిర్మించనున్న ఈ మహిళా సమాఖ్య భవనాలకు ఒక్కో భవనానికి రూ.10లక్షలు వరకు ఖర్చు చేయనున్నారు. భవనం నిర్మాణానికి 200 చదరపు గజాల స్థలం సేకరించి 569 చదరపు అడుగుల స్థలంలో స్లాబ్‌తో వర్క్‌షెడ్ నిర్మిస్తారు. ఇందులో 500 చదరపు అడుగుల్లో హాల్ ఉండాలి. రెండు తలుపులు, 6 కిటికీలు, ఆరు సీలింగ్ ప్యాన్లు, 8 ట్యూబ్‌లైట్లు ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఈ నిధులకు తోడు రూ.3లక్షల వరకు ఉపాధి నిధులు వెచ్చించి టాయ్‌లెట్ బాక్సులను కూడా నిర్మించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
మహిళా సంఘాలకు దశల వారీగా నిర్మాణం
ఒక్కో భవనానికి రూ.10లక్షలు వ్యయం
సంక్రాంతి తర్వాత శంకుస్థాపనలు!


