ఫార్మాల్డిహైడ్‌ పిడుగు | - | Sakshi
Sakshi News home page

ఫార్మాల్డిహైడ్‌ పిడుగు

Jan 3 2026 8:36 AM | Updated on Jan 3 2026 8:36 AM

ఫార్మ

ఫార్మాల్డిహైడ్‌ పిడుగు

పచ్చని పల్లెలో ఫార్మాల్డిహైడ్‌ పిడుగు కాలుష్యంపై కలవరం

పచ్చని పల్లెలో

రెడ్‌ కేటగిరీ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు

గాలి, నీరు కాలుష్యమవుతుందని ఆందోళన

నేడు న్యాల్‌కల్‌ మండలం మల్గిలో ప్రజాభిప్రాయసేకరణ

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కూరగాయలు, ఆకు కూరలు సాగు చేసే పచ్చని పల్లె అది. చెరుకు, సోయా వంటి పంటలు పండిస్తూ వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న గ్రామం. ఇలాంటి పచ్చని పల్లెలో అత్యంత కాలుష్యం వెదజల్లే రెడ్‌ కేటగిరీ పరిశ్రమ ఏర్పాట్లు జరుగుతుండటం ఆ గ్రామస్తులను తీవ్రంగా కలవరపెడుతోంది. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఈ మల్గి గ్రామం (న్యాల్‌కల్‌ మండలం) లో ఇప్పుడు ఓ ప్రైవేటు కంపెనీ ఫార్మాల్డిహైడ్‌ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పెయింట్‌ రెజిన్స్‌ ఉత్పత్తి చేసే ఈ పరిశ్రమలు రెడ్‌ కేటగిరీ (అత్యంత ప్రమాదకర కాలుష్యం వెదజల్లే పరిశ్రమల జాబితా)లో ఉంటాయి. ఇలాంటి పరిశ్రమ తమ గ్రామంలో ఏర్పాటు చేస్తే తమ ప్రాంతం విధ్వంసమవుతుందని మల్గి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తే పీల్చే గాలి విషపూరితమవుతుందని, తాగే నీరు సైతం కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు, పారే నీటిలో రసాయన వ్యర్థాలు కలిసి పంటలు సైతం విషపూరితమవుతాయని ఆందోళన చెందుతున్నారు.

హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ ఈ మాల్గి గ్రామం పరిధిలో ఫార్మాల్డిహైడ్‌ (6,000 టీపీఎం ఉత్పత్తి సామర్థ్యం కలిగిన), మరో 3,500 టన్నుల సామర్థ్యం కలిగిన మూడు రకాల రేజిన్లు ఉత్పత్తి చేసే పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు శనివారం గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు కాలుష్యనియంత్రణ మండలి కార్యాలయం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే ఈ పరిశ్రమ ఏర్పాటును మల్గి వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మల్గితోపాటు చుట్టుపక్కల ఉన్న వడ్డి, డప్పూరు, చినిగేపల్లి, రత్నాపూర్‌ తదితర గ్రామాల వాసులు ఆందోళన చెందుతున్నారు. అలాగే మల్గికి పక్కనే కర్ణాటక పరిధిలో ఉన్న గ్రామాలు ఇమామాబాద్‌, మల్కాపూర్‌, సుల్తాన్‌పూర్‌(జీ) గ్రామస్తులు కూడా తమపైనా ప్రభావం పడుతుందని అంటున్నారు. తమ గ్రామంలో ఈ పరిశ్రమ ఏర్పాటు నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని తేల్చి చెబుతున్నారు. కాలుష్య కారక పరిశ్రమ వద్దంటూ ఈ ప్రాంత వాసులు గొంతెత్తుతున్నారు. ప్రభుత్వం ఈ పరిశ్రమకు అనుమతులు ఇవ్వద్దని డిమాండ్‌ చేస్తున్నారు. లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. గ్రామంలోని యువకులు, విద్యార్థులు ఇంటింటికి తిరిగి ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఎదురయ్యే కాలుష్యపరమైన ఇబ్బందులను గ్రామస్తులకు వివరిస్తున్నారు. ఈ మేరకు కరపత్రాలను కూడా పంపిణీ చేశారు. కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఈ గ్రామాల వాసులకు మద్దతు పలికింది.

నేడు

ప్రజాభిప్రాయ

సేకరణ

ఫార్మాల్డిహైడ్‌ పిడుగు1
1/1

ఫార్మాల్డిహైడ్‌ పిడుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement