హాస్టల్‌లో న్యాయమూర్తి విచారణ
వార్డెన్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్
నారాయణఖేడ్: సిర్గాపూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతిగృహంలో వార్డెన్ వేధింపులు, నెలకొన్న సమస్యలపై విద్యార్థులు గురువారం రాత్రి రోడ్డుపై ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఖేడ్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి శ్రీధర్ మంథాని శుక్రవారం హాస్టల్‌లో విచారణ జరిపారు. విద్యార్థులతో ఆయన సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పది రోజులుగా హాస్టల్‌లో విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని, పురుగుల అన్నం వడ్డిస్తున్నట్లు విద్యార్థులు వాపోయారు. నాణ్యమైన భోజనం లేకపోవడంతో అనారోగ్యం పాలవుతున్నట్లు న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఏమైనా సమస్యలు ఎదురైతే సిర్గాపూర్ ఎస్‌ఐ దృష్టికి తీసుకెళ్లాలని విద్యార్థులకు న్యాయమూర్తి సూచించారు. కాగా, విద్యార్థులు ఆయా సమస్యలపై సిర్గాపూర్–కడ్పల్ రహదారిపై ధర్నా చేయడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశాల మేరకు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు అఖిలేశ్‌రెడ్డి హాస్టల్ సంక్షేమాధికారి, వార్డెన్ పి.కిషన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


