అటకెక్కిన ‘మన ఊరు– మనబడి’
లక్ష్యం నెరవేరకుండానేనిలిచిపోయిన కార్యక్రమం
ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
జిల్లాలో 441 పాఠశాలల ఎంపిక
మౌలిక వసతుల కల్పనకు ఏర్పాటైన పథకం
హత్నూర(సంగారెడ్డి): విద్యాభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నామని పాలకులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం మౌలిక వసతులు కరువయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ప్రభుత్వ పాఠశాలల భవనాలు నిధుల కొరతతో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
రూ. 19 కోట్ల మేర పెండింగ్
గత ప్రభుత్వం మన ఊరు– మన బడి పథకం కింద జిల్లాలోని 441 పాఠశాలలను ఎంపిక చేసింది. సుమారు నాలుగేళ్లు గడిచినా, భవన నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోయాయి. ప్రభుత్వ పాఠశాలల నిర్మాణాలకు గత ప్రభుత్వం రూ. 63.96 కోట్లు కేటాయించింది. అయితే రూ. 45.61 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. చేసిన పనులకు సంబంధించి సుమారు రూ. 19 కోట్లు ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్లకు రావాల్సి ఉంది. నిధుల కొరతతో జిల్లాలో కేవలం 180 పాఠశాల భవన నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. మన ఊరు– మనబడి, మన బస్తీ పథకంలో పాఠశాల భవన నిర్మాణాలు, మరమ్మతులు, వంటగది, మరుగుదొడ్లు, ప్రహరీ, భోజనశాల, గదిలో పిల్లలు కూర్చోడానికి డెస్కులు, గ్రీన్‌చాట్ బోర్డులు, ఉపాధ్యాయులకు టేబుల్ కుర్చీలు సమకూర్చాలి. కానీ నిధుల కొరతతో జిల్లాలో అసంపూర్తి భవనాలే దర్శనమిస్తున్నాయి. శిథిలావస్థకు చేరిన పాఠశాలల్లోనే విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. హత్నూర మండలంలో 20 పాఠశాలల్లో మన ఊరు– మనబడి కింద పనులు చేసినప్పటికీ, కేవలం మంగాపూర్, బోరపట్ల పాఠశాలల్లో మాత్రమే పూర్తిస్థాయిలో పనులు చేశారు. మిగితా 18 పాఠశాలలు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.


