గాంధీ పేర్లు లేకుండా బీజేపీ కుట్ర
మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్: నెహ్రూ, ఇందిరాగాంధీ, మహాత్మాగాంధీ పేర్లు లేకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. శనివారం పట్టణంలోని గాంధీ చౌరస్తాలో ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. మహాత్మాగాంధీ పేరును అవమానపర్చే విధంగా ఉపాధి హామీ పథకంలో ఆయన పేరును తొలగించి విబి రామ్ జీ పేరును పెట్టారని మండిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ కేడం లింగమూర్తి, కాంగ్రెస్ నాయకులు శివయ్య, రవీందర్ తదితరులు ఉన్నారు.


