చెరువులోకి ఆటో..
అడ్డొచ్చిన కోతులు
వట్‌పల్లి(అందోల్): ఆస్పత్రికి వెళ్దామని ఆటోలో బయలుదేరిన వ్యక్తి మృత్యువాత పడ్డాడు. శనివారం అందోలు మండలం అన్నాసాగర్ వద్ద జరిగిన ఈ సంఘటనపై ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాలివి. పెద్ద శంకరంపేట మండలం జంబికుంట గ్రామానికి చెందిన మామిడి విజయరావు (54)కు కొంతకాలంగా ఆరోగ్యం బాగా లేదు. దీంతో జోగిపేట ఆస్పత్రిలో చికిత్స చేయించుకుందామని మేనల్లుడైన మామిడి మహేశ్ ఆటోలో బయలుదేరాడు. అన్నాసాగర్ కట్టపైకి ఆటో చేరుకోగానే కోతుల గుంపు ఒక్కసారిగా వాహనం ముందుకు రావడంతో అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న విజయరావు నీటిలో మునిగిపోయాడు. ఆటో డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. మామ కనిపించకపోయే సరికి నీటిలో వెతికాడు. దారిన వెళ్తున్న వారు నీట మునిగిన విజయరావును ఒడ్డుకు చేర్చారు. అప్పటికే ఆయన మృతి చెందడంతో జోగిపేట ఎస్‌ఐ పాండు, పోలీసు సిబ్బంది అంబులెన్స్‌లో మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
నీట మునిగి ఒకరి మృతి
చెరువులోకి ఆటో..


