అర్హులకు డబుల్ ఇళ్లు పంపిణీ చేయాలి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్ రూరల్: నెల రోజుల్లో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలో నిర్మాణం పూర్తయిన ఇళ్ల వద్ద బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం నర్సాపూర్ చౌరస్తా వద్ద రాస్తారోకోకు దిగారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం పట్టణానికి 500 డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే 252 ఇళ్లు పూర్తి కాగా, మరో 248 ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను అర్హులకు పంపిణీ చేయాలని పలుమార్లు కలెక్టర్, మంత్రులకు విన్నవించినట్లు తెలిపారు. ఫలితం లేకపోవడంతో ధర్నా చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. నెలరోజుల్లో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూంలను అర్హులైన పేదలకు పంపిణీ చేయకుంటే తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి ప్రవేశిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, వైస్ చైర్మన్ నయీమోద్దీన్, పార్టీ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్, నాయకులు సత్యంగౌడ్, ప్రసాద్, ఆంజనేయులుగౌడ్, ఆనంద్, రాంచందర్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.


