వడ్డే శివరాజుపైనే అనుమానం!
రామచంద్రాపురం(పటాన్‌చెరు)/పటాన్‌చెరు టౌన్: గ్రేటర్ తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని జ్యోతిరావుపూలే కాలనీలో సంచలనం సృష్టించిన తల్లి, కొడుకు హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రధాన అనుమానితుడు వడ్డే శివరాజును మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శివరాజు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నట్టు సమాచారం. అతను నోరు తెరిస్తే అసలు విషయాలు బయటపడే అవకాశం ఉంది. అతని ప్రవర్తన, అతనిపై ఉన్న కేసుల విషయాలపై ఇప్పటికే పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. వడ్డే శివరాజు కొన్నేళ్లుగా చంద్రకళతో సహజీవనం సాగిస్తున్నట్లు వినికిడి. చంద్రకళతో పటు అందరితో తరుచుగా గొడవపడేవాడని సమాచారం. హత్య జరిగిన సమయంలో కొత్తవారు ఎవరైనా ఇక్కడికి వచ్చారా? అన్న కోణంలోనూ పోలీసులు సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. తల్లి, కొడుకు మృతదేహాల వద్ద లభించిన కత్తిపై ఉన్న వేలిముద్రలను పోలీసులు పరిశీలిస్తున్నారు. చంద్రకళను, రేవంత్‌ను శివరాజు హత్యచేసి తాను మెడ కోసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు.
వడ్డే శివరాజును కఠినంగా శిక్షించాలి
హత్యకు గురైన చంద్రకళ, రేవంత్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. శుక్రవారం చంద్రకళ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మృతురాలి అక్క శిరీష మాట్లాడుతూ కొంతకాలంగా తన చెల్లికి ఫోన్‌చేసి ఇబ్బంది పెట్టేవాడని, ఎవరు ఫోన్ చేసినా అనుమానించేవాడని తెలిపారు. శివరాజుకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నా తన చెల్లెలు వెంటపడి ఇబ్బంది పెట్టేవాడని చెప్పింది. చంద్రకళ, రేవంత్‌లను శివరాజు హత్య చేశాడని తెలిపారు. అతడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
‘తల్లి’ కొడుకు హత్య కేసులో
దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు
గాంధీలో చికిత్స పొందుతున్న శివరాజు
తల్లి, కుమారుడికి అంత్యక్రియలు
పటాన్‌చెరు టౌన్: తెల్లాపూర్ జే.పీ కాలనీలో జరిగిన తల్లి, కుమారుడు జంట హత్య కేసులో మృతదేహాలకు పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, పోలీసులు మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మరో పక్క బంధువులు మృతదేహాలను స్వగ్రామానికి తీసుకెళ్లలేక స్థానికంగా ఉన్న ఎండీఆర్ ఫౌండేషన్ ద్వారా అంత్యక్రియలు నిర్వహించారు.


