ప్రతిభ చాటిన ప్రార్ధిని
● లిటిల్ మిస్ ఇండియాలో రన్నరప్
● రూ.3లక్షల నగదు పురస్కారం
సిద్దిపేటజోన్: ఈనెల 21నుంచి 23వరకు ఒడిశా భువనేశ్వర్‌లో నిర్వహించిన కిట్ నన్ని పరి లిటిల్ మిస్ ఇండియా చాంపియన్ షిప్ పోటీల్లో సిద్దిపేటకు చెందిన ప్రార్ధిని రన్నరప్‌గా నిలిచింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 33 మంది పాల్గొన్నారు. వీరిలో కర్ణాటకకు చెందిన త్రిపాఠి మొదటి స్థానంలో నిలిచింది. మొదటి రన్నరప్‌గా మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రాంజల్ శర్మ నిలువగా, రెండో రన్నరప్‌గా సిద్దిపేటకు చెందిన ప్రార్ధిని నిలిచింది. ఈ సందర్భంగా రూ.3లక్షల నగదు బహుమతితో పాటు కిట్ విద్యాసంస్థల్లో చదువుకుంటే రూ.9 లక్షల వరకు ఫీజు మినహాయింపు ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ప్రార్ధినిని జిల్లా కళాకారులు అభినందించారు. ప్రార్ధినికి యూ ట్యూబ్ ఛానల్‌లో మంచి పేరుంది. కాగా ఆమె తండ్రి రాజేశ్ గాయకుడు.
వేలేటి శైలజకు డాక్టరేట్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సిద్దిపేట పట్టణానికి చెందిన వేలేటి శైలజ కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ‘‘జీ.ఎస్. మోహన్ రచనలు’’ అనే అంశంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పొందినట్లు ఇందిరానగర్ జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. ఆమె ప్రస్తుతం ఇందిరానగర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) తెలుగు టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సాహితీ రంగంలో తనదైన ముద్ర వేసుకొని డాక్టరేట్ సాధించిన శైలజ పరిశోధనకు మార్గదర్శకులుగా వ్యవహరించిన ఆచార్య రామనాథం నాయుడు, విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ శరణప్ప, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అభినందించారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
పటాన్‌చెరు టౌన్: గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన పటాన్ చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని అమేధ ఆస్పత్రి సమీపంలో ఈ నెల 23వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి పడి ఉన్నాడని, డయల్ 100కు ఫోన్ వచ్చింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మద్యం మత్తులో పడి ఉన్న వ్యక్తిని పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు గురువారం మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతుడికి సంబంధించిన బంధువులు ఉంటే పోలీసులను సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఏడుపాయల్లో వృద్ధుడు..
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల్లో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ వివరాల ప్రకారం... కొన్ని రోజులుగా ఏడుపాయల పుణ్యక్షేత్రం వద్ద భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గుర్తు తెలియని వ్యక్తి పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల చలి తీవ్రత పెరగడంతో తట్టుకోలేక మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు నీలం రంగు చొక్కా ధరించి, తెల్లని గడ్డం కలిగి ఉన్నాడు. కాగా మృతుడు నల్లగొండ జిల్లాకు చెందిన అంజిరెడ్డిగా గుర్తించారు.
ప్రతిభ చాటిన ప్రార్ధిని
ప్రతిభ చాటిన ప్రార్ధిని


