వార్డు మెంబర్ ఆత్మహత్య
కొమురవెల్లి(సిద్దిపేట): గ్రామానికి మంచి చేద్దామని వార్డు సభ్యునిగా గెలిచిన ముచ్చట తీరకముందే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం మండలంలోని అయినాపూర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 11 వార్డు సభ్యునిగా గెలిచిన దండు భానుచందర్(30) బుధవారం ఇంట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్థానికులు గమనించి సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. అతని మృతికి ఓ వివాహిత కారణమంటూ కుటుంబసభ్యులు సదరు మహిళ ఇంటి ఎదుట మృతదేహంతో నిరసన తెలిపారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనా స్థలానికి గజ్వేల్ ఏసీపీ నర్సింహులు చేరుకుని నచ్చజెప్పగా ఆందోళన విరమించారు.
బాలిక అదృశ్యం
పటాన్‌చెరు టౌన్: బాలిక అదృశ్యమైంది. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ముత్తంగి పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాలిక (16) ఈనెల 16న కిరాణా షాపునకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


