స్నానం చేసేందుకు నీటిలోకి దిగి..
పాపన్నపేట(మెదక్): స్నానం చేసేందుకు నీటిలోకి దిగిన యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన ఏడుపాయల్లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు... అందోల్ మండలంలోని మన్సాన్‌పల్లి గ్రామానికి చెందిన కదులూరి ప్రసాద్ (16) తన స్నేహితులతో కలిసి మెదక్ చర్చికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఏడుపాయల్లోని రెండో బ్రిడ్జివద్ద స్నానం చేయడానికి నీటిలోకి దిగారు. ఈ క్రమంలో ప్రసాద్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతుండగా, తోటి స్నేహితులు రక్షించడానికి విఫలయత్నం చేశారు. ఈ క్రమంలో భానుప్రసాద్ అనే మరో యువకుడు కూడా నీటిలో మునిగాడు. సమీపంలో ఉన్న మత్స్యకారుడు గమనించి నీటిలోకి దూకి భానుప్రసాద్‌ను రక్షించగా, ప్రసాద్ మాత్రం అప్పటికే నీటిలో మునిగి మృతి చెందాడు. ప్రసాద్ ఇంటర్ చదువుతున్నట్లు తెలిసింది. ఎస్‌ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడు మృతి


