కక్ష సాధింపు చర్యలు సరికాదు
జహీరాబాద్: మండలంలోని సజ్జాపూర్‌లో బేగరి రాములు ఇంటి షెడ్డును కూల్చివేసిన ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య విచా రణ జరిపారు. బుధవారం బాధిత కుటుంబంతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనను అగ్రవర్ణాల దాడిగానే భావిస్తున్నామన్నారు. ఓటు వేయలేదనే ఉద్దేశంతో కక్షసాధింపు చర్యలకు పాల్పడడం తగదన్నారు. బాధితులకు కమిషన్ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, చట్ట ప్రకారం శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని పోలీస్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈనెల 30న గ్రామంలో సివిల్ రైట్స్‌డేను అధికారికంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం కోహీర్ మండల కేంద్రంలో బాలుర, బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా సందర్శించారు. ఆయన వెంట కమిషన్ సభ్యుడు రాంబాబు, జెడ్పీ సీఈఓ, ఇన్‌చార్జి డీపీఓ జానకిరెడ్డి, డీఎస్పీ సైదా, సాంఘిక సంక్షేమ అధికారి శ్రీనివాస్‌తో పాటు ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య


