మార్కెట్ లొల్లి వీడేనా?
సదాశివపేట ఏఎంసీ
చైర్‌పర్సన్‌గా అలవేణి..
● నెలాఖరులోగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్న టీపీసీసీ
● నేతల్లో చిగురిస్తున్న ఆశలు
వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) పటాన్‌చెరు పాలకవర్గం నియామకం విషయంలో ఇద్దరు నేతలు పట్టుబడుతున్నారు. ఈ ఏఎంసీ చైర్మన్ పదవిని తన అనుచరుడు శివానందంకు ఇవ్వాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న కాటా శ్రీనివాస్‌గౌడ్ ప్రతిపాదించారు. దీనిపై ఇక్కడి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. పర్స శాంరావు పేరును గూడెం సూచించారు. ఈ పదవి కోసం ఇద్దరి నుంచి ప్రతిపాదనలు రావడంతో ఈ నియామకం విషయంలో ఎటూ తేలకుండా పోయింది.
నారాయణఖేడ్ మార్కెట్ కమిటీ పాలకవర్గ నియామకంలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఈ చైర్మన్‌తో పాటు, డైరెక్టర్ పోస్టులను స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి తన వర్గీయులకు ఇప్పించాలని ప్రయత్నిస్తుండగా, ఎంపీ షెట్కార్ వర్గీయులు కూడా ఈ పోస్టులను ఆశిస్తున్నారు. దీంతో ప్రభుత్వం దాదాపు రెండేళ్లుగా పెండింగ్‌లో పెట్టింది. ఇక్కడ ఇరువర్గాల మధ్య సమన్వయం కుదిరితేనే ఈ పదవులు తేలే అవకాశాలున్నాయి.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను ఈ నెలాఖరు లోపు భర్తీ చేస్తామని ఇటీవల టీపీసీసీ అధినాయకత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పెండింగ్‌లోఉన్న నామినేటెడ్ పదవుల పంచాయతీ ఇప్పటికై నా ఓ కొలిక్కి వచ్చేనా..? అనే అభిప్రాయం హస్తం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. నేతల మధ్య సమన్వయం కుదరకపోవడంతో చాలా వరకు నామినేటెడ్ పదవుల నియామకాల విషయంలో ఎటూ తేలడం లేదు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదవులు దక్కుతాయని ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న నాయకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ నేతల మధ్య సమన్వయం లేని కారణంగా ఆ పార్టీ నాయకుల నామినేటెడ్ కల నెరవేరడం లేదు.
ఒక టర్మే పూర్తయ్యేది..
జిల్లాలో మొత్తం ఎనిమిది వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)లు ఉన్నాయి. ఇందులో సంగారెడ్డి, రాయికోడ్, జోగిపేట్, వట్‌పల్లి, జహీరాబాద్ మార్కెట్ కమిటీల పాలకవర్గాలను ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే నియమించింది. కాగా ఏఎంసీల చైర్మన్, డైరెక్టర్ల పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. అవసరమైతే ఒక ఏడాది పాటు పొడగించుకునేందుకు అవకాశం ఉంది. కానీ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా, ఈ పదవుల్లో ఎవరినీ నియమించకపోవడంతో ఒక టర్మ్ వృథా అయిందని ఆ పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికై నా అధినాయకత్వం జిల్లాల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను ఈనెలాఖరులోగా నియమిస్తామని ప్రకటించిన నేపథ్యంలో నేతల్లో ఆశలు రేకెత్తినట్లయింది.
సదాశివపేట ఏఎంసీ చైర్మన్‌గా ఉన్న ఎస్.కుమార్ ఇటీవల ఆ పదవికి రాజీనామ చేసి సర్పంచ్‌గా పోటీ చేసిన విషయం విధితమే. ఇలా ఖాళీ అయిన ఈ పదవిని తన అనుచరుడు మస్కు నర్సింహారెడ్డికి అవకా శం కల్పిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు నర్సింహారెడ్డి భార్య మస్కు అలవేణిని నియమించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలు మార్కెటింగ్‌శాఖ ద్వారా ప్రభుత్వానికి వెళ్లాయి. త్వరలోనే ఈ చైర్‌పర్సన్ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు రానున్నాయి.


