గ్రామాభివృద్ధే లక్ష్యం కావాలి
నారాయణఖేడ్: గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే పంచాయతీ పాలకవర్గాల లక్ష్యం కావాలని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ అన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుతో విజయం సాధించిన సర్పంచ్, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు బుధవారం ఖేడ్‌లోని ఎంపీ నివాసంలో ఆయనను కలిశారు. ఈసందర్భంగా ఆయన వారిని సన్మానించారు. గ్రామాల అభివృద్ధికి తనవంతుగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్ షెట్కార్, నాయకులు పాల్గొన్నారు.
మెదక్ కలెక్టరేట్: బాలికల కోసం లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రసిక్షణ్ – స్వీయరక్షణ కార్యక్రమం చేపట్టనున్నట్లు డీఈఓ విజయ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 162 పాఠశాలల్లోని బాలికలకు 3 నెలలు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తి, అర్హత గల మాస్టర్లు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మాస్టర్లు కరాటేలో బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్ సాధించి ఉండాలన్నారు. మహిళా అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు. అర్హత గల అభ్యర్థులు ఈనెల 29 సాయంత్రం 5 గంటలలోగా కలెక్టరేట్‌లోని డీఈఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
పటాన్‌చెరు టౌన్: నట్టల నివారణ మందుతో మూగ జీవాల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని జిల్లా పశుసంవర్ధక సంయుక్త సంచాలకులు వసంతకుమారి అన్నారు. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని పెద్దకంజర్లలో బుధవా రం నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గ్రామంలో 1,247 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేసినట్లు తెలిపారు. ఈ మందు ద్వారా మరణాలు తగ్గి, జీవాల ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. జీవాల పోషకులు నట్టల నివారణ మందును సద్వినియోగం చేసుకో వాలని సూచించారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి శైలేంద్ర జస్వాల్, పశు వైద్య సిబ్బంది సర్దార్, సాబేర్ శ్రవణ్ కుమార్, సుజాత, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్: స్కూల్ ఫెడరేషన్ అండర్ 14 బాలికల విభాగంలో రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఖేడ్ ఈ–తక్షిల పాఠశాల విద్యార్థులు లాస్యరెడ్డి, లలితాంబిక, మేరీ ఎంపికయ్యారని పాఠశాల కరస్పాండెంట్ శరత్‌కుమార్ తెలిపారు. సంగారెడ్డిలోని అంబేడ్కర్ మైదానంలో ఉమ్మడి మెదక్ జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచినట్లు చెప్పారు. వనపర్తిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఈసందర్భంగా విద్యార్థినులను ఉపాధ్యాయులు అభినందించారు.
కౌడిపల్లి(నర్సాపూర్): తునికి వద్ద గల డాక్టర్ రామానాయుడు విజ్ఞానజ్యోతి గ్రామీణాభివృద్ధి విద్యా సంస్థ, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ఆరునెలల ఉచిత వ్యవసాయ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, కోఆర్టినేటర్ జగదీశ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కనీసం 10వ తరగతి పాస్ అయిన 18 నుంచి 25 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యవసాయ, అనుబంధ కుటుంబాలకు చెందిన పిల్లలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆరునెలల శిక్షణ కాలంలో ఉచితంగా విద్య, భోజనంతో పాటు క్షేత్రస్థాయిలో శిక్షణ, యువతీ, యువకులకు వేర్వేరుగా హాస్టల్ వసతి ఉంటుందన్నారు. అభ్యర్థులు జనవరి 15 వరకు బయోడేటాతో కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 9989147966, 8466842278 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
గ్రామాభివృద్ధే లక్ష్యం కావాలి
గ్రామాభివృద్ధే లక్ష్యం కావాలి


