ప్రాజెక్టుల సాధనకు ఉద్యమిద్దాం
● జహీరాబాద్ నుంచి ఖేడ్ వరకు పాదయాత్ర చేపడతా
● మాజీ మంత్రి హరీశ్‌రావు
జహీరాబాద్: కాళేశ్వరం నుంచి జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాలకు ఎత్తిపోతల ద్వారా సాగు నీటిని అందించేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల సాధనకు ఆందోళన చేపడతానని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం జహీరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన సర్పంచ్‌ల సత్కార కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. రెండు ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పాతర వేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం పనులు ప్రారంభించిందని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని నిలిపివేసిందన్నారు. జిల్లా మంత్రి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వీటిని సాధించే నిమిత్తం జహీరాబాద్ నుంచి నారాయణఖేడ్ వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సంగమేశ్వర ప్రాజెక్టు వస్తే జహీరాబాద్‌లోని లక్ష ఎకరాలకు సాగు నీరందే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ రంగానికి 12 గంటలు కూడా కరెంట్ ఇవ్వని పరిస్థితి ఉందన్నారు. జహీరాబాద్ మున్సిపల్ అభివృద్ధికి కోసం రూ.50 కోట్ల నిధులను కేసీఆర్ మంజూరు చేశారన్నారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని దారి మళ్లించిందని విమర్శించారు. కాంగ్రెస్ గూండాగిరి చేసినా, డబ్బులు పంచినా జహీరాబాద్ నియోజకవర్గంలో 52 సర్పంచ్ పదవులను దక్కించుకోగలిగామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలంటే రేవంత్‌రెడ్డి భయపడుతున్నారని ఎద్దేవాచేశారు. జహీరాబాద్‌కు 50 పడకల మాతా శిశు సంక్షేమ ఆస్పత్రిని మంజూరు చేస్తే ప్రస్తుతం పనులు ఆగిపోయాయని విమర్శించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, చింతా ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నరోత్తం, ఆయా మండలాల బీఆర్‌ఎస్ అధ్యక్షులు తట్టు నారాయణ, వెంకటేశం, సంజీవరెడ్డి, నర్సింహులు, మాజీ జెడ్పీటీసీ స్వప్న భాస్కర్, కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లు పాల్గొన్నారు.


