హైవేపై ప్రమాదాలకు చెక్
● సర్వీస్ రోడ్లు, ఆర్వోబీల నిర్మాణానికి నిధులు
● ప్రారంభమైన పనులు
రామాయంపేట(మెదక్): 44వ జాతీయ రహదారిపై రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సర్వీస్ రోడ్లు, ఆర్వోబీల నిర్మాణాలకు చర్యలు చేపట్టింది. జిల్లా పరిధిలో కాళ్లకల్ నుంచి రామాయంపేట మండలం దామరచెరువు వరకు 55 కిలోమీటర్ల మేర 44వ జాతీయ రహదారి విస్తరించి ఉంది. అతివేగం, అజాగ్రత్త మూలంగా నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నెలలో కనీసం పదిహేనుకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, పదుల సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారు. ఈమేరకు పోలీస్‌శాఖతో పాటు హైవే అధికారులు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించారు. ప్రాధాన్యతాక్రమంలో సర్వీస్ రోడ్లు, ఆర్వోబీలు నిర్మించడానికి నిర్ణయించారు. ఈమేరకు కోమటిపల్లి, వల్లూరు, వడియారం వద్ద ఆర్వోబీలు మంజూరుకు ఎంపీ రఘునందన్‌రావు కృషి చేశారు. కోమటిపల్లి, వల్లూరు వద్ద జాతీయ రహదారిని ఆనుకునే సర్వీస్ రోడ్లు, వడియారం వద్ద ఆర్వోబీ నిర్మాణానికి ఇటీవల రూ. 44.17 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం వల్లూరు వద్ద సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈమేరకు సర్వీస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా బ్రిడ్జి నిర్మిస్తున్నారు. వడియారం వద్ద ఆర్వోబీ నిర్మాణ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. త్వరలో కోమటిపల్లి జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రకటించారు.
జాతీయ రహదారిపై ప్రధానంగా రామాయంపేట జంక్షన్ వద్ద నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ ఆర్వోబీ మంజూరు విషయమై సంబంధిత శాఖ అధికారులకు, ఎంపీకి స్థానికులు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఈజంక్షన్ వద్ద ఆర్వోబీ నిర్మిస్తే ప్రమాదాలు ఆస్కారం ఉండదు. ఇటీవల కలెక్టర్ రాహుల్‌రాజ్, ఇంజనీరింగ్ అధికారులు జంక్షన్ వద్ద రహదారిని పరిశీలించారు.


