డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి
జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్
చేగుంట(తూప్రాన్): చేగుంటకు డిగ్రీ కళాశాల మంజూరయ్యేలా కృషి చేస్తానని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ అన్నారు. బుధవారం మండలకేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎడ్యుకేషన్ హబ్‌లో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక చొరవ చూపిస్తానని తెలిపారు. రాష్ట్రంలో 17 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దుబ్బాక నియోజకవర్గానికి రెండో విడతలో 3,500 ఇళ్లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పా టు కాగానే 50 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, ఉచిత కరెంట్, సన్నబియ్యం వంటి సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. ఇటీవల దెబ్బతిన్న రోడ్ల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మంత్రిని దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌రాజ్, సర్పంచ్ స్రవంతి, ఆర్టీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్, మార్కె ట్ కమిటీ చైర్మన్ వెంగళ్‌రావు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నవీన్‌తో పాటు పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.


