డిస్కౌంట్ పేరుతో భారీ మోసం
● స్టీల్, సిమెంట్ ఇస్తామని..
● 5.68 లక్షలు కొల్లగొట్టిన
సైబర్ నేరగాళ్లు
బెజ్జంకి(సిద్దిపేట): బిగ్ డిస్కౌంట్‌లో స్టీల్, సిమెంట్ ఇస్తామని చెప్పి ఆన్‌లైన్ సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఓ వ్యక్తి నుంచి రూ.5.68 లక్షలు కొల్లగొట్టారు. ఈ ఘటన మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా... బహిరంగ మార్కెట్‌లో స్టీల్ టన్నుకు రూ.6వేలకు పైగా ఉండగా కేవలం రూ.4,025, సిమెంట్ బస్తా రూ. 200కు ఇస్తామని ఓ ప్రముఖ స్టీల్ కంపెనీ, బేగంపేట, హైదరాబాద్ పేరుతో ఆన్‌లైన్‌లో ఆఫర్ వచ్చింది. దీన్ని చూసిన మండలానికి చెందిన వ్యక్తి తక్కువ ధరకు లభిస్తుందని మూడు రోజుల క్రితం సైబర్ నేరగాళ్లకు చెందిన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఖాతాల్లో 5.68లక్షలు జమ చేశారు. ఆ తరువాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైం టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేశాడు. అనంతరం హైదరాబాద్‌లో ఉన్న అడ్రస్‌కు వెళ్లగా షాప్ ఉంది కాని, వీరు డబ్బులు పంపిన వ్యక్తుల చిరునామా మాత్రం కాకపోవడంతో వెనుదిరిగి వచ్చారు.


