కుష్ఠుపై సమరం
● వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు
31 వరకు సర్వే
● ఇంటింటికి ఆశ కార్యకర్తలు
నారాయణఖేడ్: కుష్ఠు నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. 2027 వరకు దేశంలో ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలన దిశగా గ్రామాల్లో సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సర్వే ఈనెల 31వ తేదీ వరకు కొనసాగనుంది. గ్రామాల్లో వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కుష్ఠు అనేది చర్మ సంబంధిత వ్యాధి. దీనిని ప్రాథమిక దశలో గుర్తించక పోవడం వల్ల వ్యాధి తీవ్రరూపం దాల్చి అంగవైకల్యం వచ్చి మానసికంగా కుంగి పోతుంటారు. అంటు వ్యాధి కావడంతో సమాజంలో ఈ వ్యాధి సోకిన వారిని ఎవ్వరూ అక్కున చేర్చుకోలేక పోవడంతో విగత జీవులుగా మారి మరణానికి దగ్గరవుతున్నారు. రోగుల్లో ఉన్న భయానకమైన పరిస్థితులను తీర్చడానికి వారి పట్ల ప్రజలు, దగ్గరి వారు సైతం చూపిస్తున్న చిన్న చూపును దూరం చేసి వారికి అవగాహన కల్పించేందకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా వైద్యశాఖ అధికారులు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే నిర్వహిస్తున్నారు.
ఇంటింటి సర్వే
వైద్య శాఖ అధికారులు ఆశ కార్యకర్తలతో ఇదివరకే సమావేశం నిర్వహించి ఇంటింటి సర్వేకు సంబంధించి మార్గదర్శకాలను వివరించారు. ఆ మేరకు గ్రామాల్లో సర్వే కొనసాగిస్తున్నారు. జిల్లాలోని 34 పీహెచ్‌సీల పరిధిలోని 929 మంది ఆశ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరిపై హెల్త్ సూపర్‌వైజర్లు పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది మొదల్లో నిర్వహించిన సర్వేలో జిల్లా వ్యాప్తంగా 96 కొత్త కేసులను అధికారులు గుర్తించారు. గుర్తించిన వ్యాధిగ్రస్తులకు తగు చికిత్సలు అందజేస్తున్నారు. ప్రస్తుతం కూడా వ్యాధి గ్రస్తుల గుర్తింపు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది.
లక్షణాలు
వ్యాధి సోకిన వారి చర్మంపై రాగి రంగులో మచ్చలు ఉండి స్పర్శ ఉండదు. నరాలు తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చేతులు, కాళ్లలో బొబ్బలు రావడం లాంటివి కనిపిస్తాయి. దీర్ఘకాలం పుండ్లు మానకపోవడం, శరీర అవయవాలు రోజు రోజుకు కుంచించుకుపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలోని పీహెచ్‌సీలో సంప్రదించాలి. వ్యాధి తీవ్రత బట్టి 1 నుంచి 5 మచ్చలు ఉంటే ఆరు నెలలు, లేదంటే ఆరు కంటే ఎక్కువ మచ్చలు ఉండి నరాలు ఉబ్బి ఉంటే ఎన్‌డీటీ 12 నెలల్లో ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రించ చేయవచ్చు. చికిత్సతో పాటు రోగులకు కావాల్సిన అన్ని మందులను అందిస్తారు. చికిత్సలు పొంది మందులు వాడితే వ్యాధి తగ్గుముఖం పట్టి అందరిలాగే సాధారణ జీవనం కొనసాగించవ్చని వైద్యులు పేర్కొంటున్నారు.
వ్యాధి సంక్రమణ
కుష్ఠు వ్యాధి మైక్రో బ్యాక్టీరియం లెప్రి అనే క్రమి ద్వారా సంక్రమిస్తోంది. అపరిశుభ్రత ప్రాంతాల్లో నివసించే వారికి ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చిన్న, పెద్ద, మగ, ఆడ భేదం లేకుండా అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తోంది. లాలాజలం ద్వారా రోగితో సన్నిహితంగా ఉన్నా సోకుతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్న పిల్లలకు, వృద్ధులకు త్వరగా సోకే ప్రమాదం ఉంటుంది.


