బ్యాడ్మింటన్‌లో మిస్బా ప్రతిభ
రామాయంపేట(మెదక్): గజ్వేల్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ పోటీలో రామాయంపేటకు చెందిన మిస్బా రెండో స్ధానంలో నిలిచింది. ఈ సందర్భంగా ప్రశంసా పత్రంతో పాటు అవార్డు సొంతం చేసుకుంది. పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్న మిస్బా బ్యాడ్మింటన్ పోటీలో రాణిస్తూ పలుమార్లు ఎన్నో బహుమతులు గెల్చుకుంది. ఈమేరకు స్థానికంగా పలు పార్టీల నాయకులు ఆమెను ప్రశంసించారు.
మార్కోస్ కమాండోగా
ఆకునూరు యువకుడు
చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని ఆకునూరుకు చెందిన జక్కు చందు అనే యవకుడు మార్కోస్ కమాండోగా ఎంపికయ్యాడు. మూడేళ్ల క్రితం ముంబైలోని భారత నౌకాదళంలో చేరిన అతడు అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అత్యంత ప్రతిష్టాత్మక విభాగం మైరెన్ ఫోర్స్‌లో కమాండోగా ఎంపికయ్యాడు. దేశంలో అత్యంత కఠినమైనదిగా పేరొందిన గోవాలోని ఐఎన్‌ఎస్ మాండోవి వద్ద 8 నెలల శిక్షణను విజయవంతంగా పూర్తి చేశాడు. ఈ సందర్భంగా చందును గ్రామస్తులు, యువత అభినందిస్తూ గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు.
ఆగి ఉన్న లారీ ఢీకొట్టిన
ఆర్టీసీ బస్సు
20 మందికి గాయాలు
సిద్దిపేటఅర్బన్: రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన రాజీవ్ రహదారి పొన్నాల శివారులో బుధవారం తెల్లవారు జామున జరిగింది. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 24 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో నాగులబండ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మందికి స్వల్ప, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన వారిని హైదరాబాద్‌కు తరలించారు. ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌తో పాటు ఆర్టీసీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తి అదృశ్యం
హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని మద్దుల్‌వాయి గ్రామానికి చెందిన గంగాపురం రాజయ్య తప్పిపోయాడని ఎవరైనా ఆచూకీ తెలిస్తే చెప్పాలని కుటుంబీకులు హవేళిఘణాపూర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నల్లరంగు స్వెటర్ వేసుకొని ఉన్నాడని పేర్కొన్నారు. ఇతని ఆచూకీ తెలిస్తే సెల్: 81253 19325. 81870 60723లకు సమాచారం అందించాలని కోరారు.
ఇంటి నుంచి వెళ్లి.. శవమై..
రామచంద్రాపురం(పటాన్‌చెరు): రామచంద్రాపురం పట్టణంలోని రాయిసముద్రం చెరువు కట్ట సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు.ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భారతినగర్ డివిజన్ పరిధిలోని బొంబై కాలనీకు చెందిన సైమాన్(49) మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో డీమార్ట్ వద్ద తన వాహనం ఉందని, దానిని తెచ్చుకుంటానని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. బుధవారం రామచంద్రారెడ్డినగర్ కాలనీ సమీపంలోని రాయిసముద్రం చెరువు కట్ట వద్ద సైమాన్ మృతి చెంది ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
బ్యాడ్మింటన్‌లో మిస్బా ప్రతిభ
బ్యాడ్మింటన్‌లో మిస్బా ప్రతిభ


