డబ్బా తొలగింపులో తీవ్ర ఉద్రిక్తత
నర్సాపూర్ రూరల్: పండ్ల దుకాణం డబ్బాను తొలగించే విషయంలో బుధవారం నర్సాపూర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మురికి కాలువ నిర్మాణం కోసం నర్సాపూర్– మెదక్ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఆర్టీసీ బస్టాండ్ స్థలంలో ఉన్న ఓ డబ్బాను తొలగించేందుకు జేసీబీతో మున్సిపల్ అధికారులు పోలీసుల సహకారంతో అక్కడికి వచ్చారు. దీంతో పట్టణంలోని ఖాజీ గల్లీకి చెందిన ఫరూక్ తన డబ్బాను తొలగిస్తే ఆత్మహత్య చేసుకుంటానని పెట్రోల్ డబ్బాతో జేసీబీకి అడ్డంగా పడుకున్నాడు. డబ్బాను తొలగించకుంటే మురికి కాలువ నిర్మాణం కాక మురికి నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతుందని అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సుమారు రెండు గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడికి మాజీ కౌన్సిలర్లు సంఘసాని సురేశ్, గోడ రాజేందర్ చేరుకొని మురికి కాలువ నిర్మాణం పూర్తి కాగానే దానిపై స్లాబ్ వేసి ఫరూక్‌కు డబ్బా నిర్మించి ఇవ్వాలని అధికారులకు విన్నవించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం డబ్బాను తొలగించే పనులు ప్రారంభించారు.
జేసీబీకి అడ్డుగా పడుకొని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిక
నచ్చజెప్పిన మాజీ కౌన్సిలర్లు


