కత్తితో దాడి.. గొలుసు అపహరణ
సంగారెడ్డిటౌన్/కంది(సంగారెడ్డి): ఓ మహిళపై కత్తితో దాడి చేసి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన సంఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డీఎస్పీ సత్యయ్యగౌడ్ కథనం ప్రకారం.. మునిపల్లి మండలం తాటిపల్లికి చెందిన మ్యాతరి జగన్(37), ర్యాపిడో డ్రైవర్ పని చేస్తూ ఇస్నాపూర్‌లో నివసిస్తున్నాడు. జల్సాలు చేస్తూ.. అప్పులు పెరిగిపోవటంతో వచ్చిన ఆదాయం చాలక దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 22న కంది మండలం మామిడిపల్లికి చెందిన ఓ మహిళ(37) ఒంటరిగా మేకలు మేపుతుండటం చూసి ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును ఇవ్వాలని కత్తితో బెదిరించాడు. ఆమె నిరాకరించడంతో మెడపై, కడుపులో పొడిచి గొలుసు ఎత్తుకెళ్లాడు. కేసు నమోదు చేసుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులు సీసీఎస్ పోలీసుల సహకారంతో నిందితుడిని 24 గంటల లోపే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి నాలుగు తులాల బంగారు గొలుసు, బైకును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్‌ను డీఎస్పీ నగదు రివార్డుతో సత్కరించారు. సమావేశంలో సంగారెడ్డి రూరల్ సీఐ క్రాంతికుమార్, ఎస్సై మధుసూదన్‌రెడ్డి, సీసీఎస్ ఎస్‌ఐ శ్రీకాంత్, సిబ్బంది తదితరులు ఉన్నారు.
కేసును ఛేదించిన పోలీసులు
నిందితుడి అరెస్టు


