మోదీ పాలనలోనే అభ్యున్నతి
గజ్వేల్‌రూరల్: ప్రధాని నరేంద్రమోదీ పాలనలోనే అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి జరుగుతోందని హర్యాన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ నుంచి సర్పంచ్‌లుగా గెలుపొందిన 11 మందికి రిమ్మనగూడలోగల ఓ ఫాంహౌస్‌లో బుధవారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దత్తాత్రేయ వారిని సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయవాద భావజాలం గ్రామగ్రామాన విస్తరిస్తోందని, జాతీయవాదమే దేశానికి అతిపెద్ద బలమైన శక్తి అని అన్నారు. నాయకుడు కావాలంటే డబ్బు అవసరం లేదని, ప్రజలతో మమేకమై వారు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచి ఆదుకున్నప్పుడే మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. పార్లమెంట్‌లో ఉపాధి హామీ పథకం నూతన చట్టాన్ని తీసుకువచ్చి రైతులు, రైతు కూలీలకు మేలు చేకూర్చేలా చేశారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, నాయకులు కప్పర ప్రసాద్‌రావు, ఎల్లు రాంరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ


