
ఆధార్‌కార్డు ఉన్నా టికెట్ కొడతారా?
● జిరాక్స్ కాపీ కావడంతో టికెట్ కొట్టిన కండక్టర్ ● జోగిపేట కంట్రోలర్‌తో మహిళ వాగ్వాదం
జోగిపేట(అందోల్): మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి తన దగ్గర టికెట్‌కు డబ్బులు ఎందుకు తీసుకున్నారని ఓ మహిళ ఆర్టీసీ కంట్రోలర్‌ను నిలదీసింది. వివరాలు ఇలా... చౌటకూరు బస్‌స్టేజీ వద్ద బస్సు ఎక్కిన మహిళ జోగిపేట వరకు వెళుతున్నానని కండక్టర్‌కు తన వద్ద ఉన్న జిరాక్స్ ఆధార్‌కార్డును చూపించింది. ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా అని కండక్టర్ ప్రశ్నించడంతో నిన్న కూడా జిరాక్స్ కార్డుపైనే ఉచితంగా ప్రయాణించానని చెప్పింది. ఆధార్ జిరాక్స్ కాపీతో పాటు అప్‌డేట్ లేకపోవడంతో కండక్టర్ ఆమెకు టికెట్ కొట్టి డబ్బులు తీసుకున్నాడు. కాగా, జోగిపేట బస్టాండ్‌కు వచ్చిన తర్వాత ఆ మహిళ... ఉచిత బస్సు అని చెప్పి పైసలు వసూలు చేస్తున్నారని ఆర్టీసీ కంట్రోలర్ నాగేందర్ చారిని నిలదీసింది. ఇది ఒరిజినల్ కాదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జారీ చేసిన ఆధార్ కార్డు అని, వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. బస్టాండ్‌లో ఇతర కండక్టర్లు కూడా చాలా సేపు నచ్చజెప్పినా ఆ మహిళ వినిపించుకోకుండా వివాదం సృష్టించింది. పలువురు ప్రయాణికులు ఆమెకు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.