సత్వరమే ఎఫ్‌ఓఎంఎస్‌లతో పరిష్కారం జిల్లాలో 477 ఫీడర్లు అన్నింటికి యూనిట్ల బిగింపు
మెదక్ కలెక్టరేట్: ఒకప్పుడు వర్షాకాలం వచ్చిందంటే వానతోపాటు ఈదురు గాలుల కారణంగా అనేక విద్యుత్ సమస్యలు వచ్చేవి. దీంతో ఆ సమస్యలను పరిష్కరించాలంటే రోజుల సమయం పడుతుంది. లైన్‌మెన్‌లు, అధికారులు వెతికి వెతికి సమస్యను గుర్తించాల్సి వచ్చేది. ప్రస్తుతం వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించే లక్ష్యంగా విద్యుత్ శాఖ సాంకేతిక ఒరవడిపై దృష్టి పెట్టింది. రైతులు, ప్రజలు, వ్యాపారులు, పరిశ్రమలకు నిరంతరం విద్యుత్ అందించేందుకు చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా సాంకేతిక పరమైన ఎఫ్‌ఓఎంఎస్ యూనిట్లను తీసుకొచ్చింది. వీటితో ఎక్కడైన విద్యుత్ సమస్య ఏర్పడితే క్షణాల్లో స్పాట్‌ను గుర్తించి సమస్యను పరిష్కరిస్తారు. జిల్లాలోని పలు ఫీడర్లకు ఎఫ్‌ఓఎంఎస్ (ఫీడర్ ఔట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్)లను అమర్చారు.
క్షణాల్లో పరిష్కారం
జిల్లాలో 33, 11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లు మొత్తం 127 ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న 477 ఫీడర్లకు ఎఫ్‌ఓఎంఎస్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కో ఎఫ్‌ఓఎంఎస్ 65 విద్యుత్ స్తంభాల పరిధిలో పనిచేస్తుంది. దీని గురించి తెలుసుకునేందుకు జిల్లాలోని అన్ని విద్యుత్ స్తంభాలకు నంబర్లు వేశారు. ఎక్కడ సమస్య వచ్చినా నిమిషాల్లో సమాచారం వస్తుంది. ఫలితంగా విద్యుత్ సిబ్బంది సమస్యను వెతకాల్సిన ఇబ్బందులు తగ్గుతాయి.
నాణ్యమైన విద్యుత్ అందిస్తాం
జిల్లాలోని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడం లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఎప్పటికప్పుడు విద్యుత్ శాఖలో సాంకేతిక ఒరవడిని తీసుకొస్తున్నాం. ఇందులో భాగంగా ఎఫ్‌ఓఎంఎస్‌లు బిగించాం. దీంతో చాలా వరకు విద్యుత్ సమస్యలు క్షణాల్లో పరిష్కరిస్తూ నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం.
– నారాయణ నాయక్,
విద్యుత్‌శాఖ ఎస్‌ఈ, మెదక్
విద్యుత్‌లో సాంకేతిక ఒరవడి
ఎఫ్‌ఓఎంఎస్‌ల పనితీరు
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు విద్యుత్ శాఖ జిల్లాలోని పలు ఫీడర్లకు ఎఫ్‌ఓఎంఎస్‌లను ఏర్పాటు చేసింది. ఎక్కడైన విద్యుత్‌త్ సమస్య ఏర్పడితే క్షణాల్లో గుర్తించేందుకు ఇవి పనిచేస్తాయి. ఎఫ్‌ఓఎంఎస్ యూనిట్‌కు మూడు ఇండికేటర్లు ఉంటాయి. విద్యుత్ ఫీడర్లకు మూడు విద్యుత్‌లైన్‌లను ఇవి కవర్ చేస్తాయి. ఏ లైన్‌లో విద్యుత్ సమస్య ఏర్పడితే ఆ లైన్ ఇండికేటర్ వెలుగుతుంది. వీటిలో సిమ్‌కార్డు ఉండటం వల్ల సమస్య ఏర్పడిన లొకేషన్‌తో స్థానికంగా ఉండే లైన్‌మెన్‌కు ఏఈ, ఏడీఈల సెల్‌ఫోన్‌లకు సమాచారం పంపిస్తుంది. వీటి ద్వారా విద్యుత్ సమస్య ఏర్పడితే సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అధికారులు తక్షణం స్పందించి అక్కడికి చేరుకుని పరిష్కరిస్తారు. ఫలితంగా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందుతుంది. ఽఅధికారులు క్షణాల్లో స్పందించి సమస్య పరిష్కరించడంతో విద్యుత్ ప్రమాదాలు కూడా తగ్గనున్నాయి.
కరెంట్ సమస్యలకు చెక్