
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్
వర్గల్(గజ్వేల్): గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం కేసుకు సంబంధించి గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్‌రెడ్డి, గౌరారం ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. వర్గల్ శివారులో కొంతమంది గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. వెంటనే అక్కడకు వెళ్లి అనుమానాస్పదంగా కనిపిస్తున్న వేలూరుకు చెందిన అరిగె ఆంజనేయులు(22), తూప్రాన్‌కు చెందిన తుమ్మల ప్రశాంత్ (20), మామిడి నికిత్ రెడ్డి(19)లను అదుపులోకి తీసుకున్నారు. వారి బైక్ కవర్‌లో ఉన్న 93 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నాందేడ్ పట్టణానికి చెందిన విజయ్ బాలేరావ్ వద్ద గంజాయి కొనుగోలు చేసి వేలూరు, వర్గల్ తదితర ప్రాంతాల్లో లేబర్, యువకులకు అమ్ముతున్నట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి బైక్, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.