
రోడ్డు ప్రమాదంలో అధికారికి గాయాలు
పరామర్శించిన మంత్రి తుమ్మల
గజ్వేల్: రోడ్డు ప్రమాదంలో అధికారి గాయపడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... నర్మెటలో ఉన్న ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీలో సమావేశానికి మంగళవారం ఆయిల్‌ఫెడ్ అధికారి ప్రశాంత్‌కుమార్ వెళుతున్నాడు. ఈ క్రమంలో మండలంలోని రిమ్మనగూడ వద్ద రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం గజ్వేల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమావేశంలో పాల్గొనేందుకు సిరిసిల్ల వైపు నుంచి వస్తున్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రశాంత్‌కుమార్‌కు ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాద ఘటనతో సమావేశం వాయిదా పడింది.