
చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు
పది రోజుల తర్వాత శవం లభ్యం
కొల్చారం(నర్సాపూర్): చేపల వేటకు వెళ్లిన వ్యక్తి నదిలో గల్లంతై పది రోజుల తర్వాత శవమై తేలాడు. ఈ ఘటన మండలంలోని ఎరగ్రండ్ల గ్రామంలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్‌ఐ హైమద్ మోహినొద్దీన్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఏషబోయిన దుర్గేశ్(38) ఈనెల 17న గ్రామ శివారులో ప్రవహిస్తున్న మంజీరా నదిలోకి చేపల కోసం వెళ్లాడు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో నదిలో గల్లంతయ్యాడు. ప్రస్తుతం ఎగువ నుంచి నది నీటి ప్రవాహం తగ్గడంతో కోనాపూర్ గ్రామ రైతులు నది వైపు వెళ్లారు. వారికి నదిలో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తించి దుర్గేశ్‌గా నిర్ధారించారు. మృతుని భార్య శైలజ పోలీసులకు ఫిర్యాదు చేసింది.