
మార్కెట్‌కు ‘మొక్కజొన్న’
● పచ్చి కంకులు అమ్మడానికి రైతుల ఆసక్తి ● జోరుగా కొనుగోళ్లు
జహీరాబాద్ టౌన్: సీజన్ కావడంతో జహీరాబాద్ మార్కెట్‌కు మక్క కంకులను రైతులు తీసుకొస్తున్నా రు. వర్షాలు కురుస్తున్నందున మొక్కజొన్న రైతులు పచ్చి కంకులనే అమ్ముకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ధర గిట్టుబాటు అవుతుండటంతో అమ్మకాలు, కొనుగోళ్లతో మార్కెట్ కళకళలాడుతోంది.
జహీరాబాద్ వ్యవసాయ డివిజన్‌లో పత్తి, కంది, సోయాబీన్ తరువాత మొక్కజొన్నను రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. కొంత మంది రైతులు చెరకులోనూ అంతరపంటగా మొక్కజొన్న పండిస్తుంటారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది డివిజన్‌లో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 75 శాతం వరకు పెరిగింది. జహీరాబాద్, న్యాల్‌కల్, మొగుడంపల్లి, కోహీర్, ఝరాసంగం తదితర మండలాల్లో రైతులు గత సంవత్సరం 3 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఈ సంవత్సరం సుమారు 11 వేల ఎకరాల్లో పంట సాగవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. మొక్కజొన్నకు కేంద్రం కనీస మద్దతు ధర రూ. 2,360 ప్రకటించడం వల్ల గిట్టుబాటవుతుందని సాగుకు మొగ్గు చూపారు.
మార్కెట్‌లో కొనుగోళ్లు..
సీజన్ కావడంతో మార్కెట్‌కు రైతులు పచ్చి కంకులను తీసుకొస్తున్నారు. వర్షాల కారణంగా మొక్కజొన్న కంకులను(బుట్టాలు) ఎండబెట్టడం శ్రమతో కూడుకున్న పని కారణంగా రైతులు పచ్చి కంకులనే విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. పట్టణంలోని పశువుల సంత వద్ద రహదారి పక్కనే మార్కెట్ ఉండటంతో దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారు వాహనాలను ఆపి కంకులను కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లో ప్రస్తుత ధర కిలోకు రూ.16 నుంచి 20 వరకు పలుకుతోంది. గిట్టుబాటు ధర లభిస్తుండటంతో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చిరువ్యాపారులు కాల్చిన ఒక్కో కంకిని రూ. 20కు అమ్ముతున్నారు.