
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఉద్యోగి
మద్దూరు(హుస్నాబాద్): లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన మండల కేంద్రంలోని ఉపాధి హామి కార్యాలయంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే... జాతీయ ఉపాధిహామి పథకం కార్యాలయంలో ఈజీఎస్‌లో ఈసీ (ఇంజనీరింగ్ కన్సెల్టెంట్)గా పని చేస్తున్న బండకింది పరశురాములు తన కింది ఉద్యోగి వద్ద ఫైళ్ల చెక్, కొలతల ధృవీకరణ, బిల్లు ఆమోదం కోసం ఉన్నతాధికారులకు ఫైల్‌ను పంపేందుకు లంచం డిమాండ్ చేశాడు. అంత నగదును ఇవ్వలేనని తగ్గించాలని అతడు బ్రతిమిలాడినా వినలేదు. దీంతో సదరు ఉద్యోగి ఈనెల 20న అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం మధ్యాహ్నం ఉద్యోగి నుంచి పరశురాములు రూ.11,500 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. నగదును స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్ నాంపల్లిలోని అదనపు స్పెషల్ జడ్జి, ఏసీబీ ఎదుట హాజరు పర్చనున్నట్లు తెలిపారు. ఉపాధి హామి కార్యాలయంతోపాటు పరశురాములు స్వగ్రామమైన చేర్యాల మండలం శభాష్‌గూడెంలోని అతని ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. కాగా నిందితుడికి ఈనెల 15న ఉత్తమ అవార్డు రావడం గమనార్హం.